Team India: మళ్లీ ఓడిన టీమిండియా... థ్రిల్లింగ్ మ్యాచ్ లో శ్రీలంక విన్నర్
- ఆసియాకప్ లో సూపర్-4 మ్యాచ్
- తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా
- 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు
- 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించిన శ్రీలంక
- రాణించిన నిస్సాంక, మెండిస్, షనక, రాజపక్స
- చహల్ కు 3 వికెట్లు
ఆసియా కప్ సూపర్-4 దశలో టీమిండియా వరుసగా రెండో మ్యాచ్ లోనూ పరాజయం చవిచూసింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ సేన 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. భారత్ విసిరిన 174 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 19.5 ఓవర్లలో ఛేదించింది. ఈ మ్యాచ్ లో శ్రీలంకకు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు పత్తుమ్ నిస్సాంక (52), కుశాల్ మెండిస్ (57) తొలి వికెట్ కు 97 పరుగులు జోడించారు.
అయితే ఈ దశలో చహల్ విజృంభించి 3 వికెట్లు తీయగా, అశ్విన్ ఓ వికెట్ తీయడంతో లంక కష్టాల్లో పడింది. కానీ కెప్టెన్ దసున్ షనక, భానుక రాజపక్స జోడీ భారత్ కు మరో అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ ను ముగించింది. మ్యాచ్ చివరి ఓవర్ వరకు వచ్చినప్పటికీ విజయలక్ష్మి శ్రీలంకనే వరించింది. షనక 18 బంతుల్లో 33 పరుగులు, భానుక రాజపక్స 17 బంతుల్లో 25 పరుగులు చేశారు.
కాగా, ఈ ఓటమితో టీమిండియా ఫైనల్ ఆశలు అడుగంటాయి. ఇక ఇతర జట్ల మ్యాచ్ ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీమిండియా తన చివరి లీగ్ మ్యాచ్ ను ఈ నెల 8న ఆఫ్ఘనిస్థాన్ తో ఆడాల్సి ఉంది.