Shoaib Akhtar: భారత్ ఇప్పుడు కెప్టెన్ ను మార్చే తప్పు చేయకూడదు: షోయబ్ అక్తర్

India have got a good wakeup call in Asia Cup Shoaib Akhtar
  • రోహిత్ శర్మ ఎంతో అసౌకర్యంగా కనిపిస్తున్నాడన్న పాక్ మాజీ క్రికెటర్
  • తుది 11 మంది సభ్యుల పరంగా అనిశ్చితి ఉందన్న అభిప్రాయం
  • ఆసియాకప్ భారత్ కు మేల్కొలుపుగా పేర్కొన్న అక్తర్
ఆసియా కప్ భారత్ కు ఓ చక్కని మేల్కొలుపు అని పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ అభివర్ణించాడు. ఆస్ట్రేలియాలో అతి త్వరలో జరిగే టీ20 ప్రపంచకప్ కు తన తుది 11 మంది సభ్యుల జట్టును గుర్తించేందుకు మంచి అవకాశమన్నాడు. భారత జట్టు గ్రూపు దశలో రెండు మ్యాచుల్లోనూ నెగ్గగా.. సూపర్ 4లో వరుసగా పాకిస్థాన్, శ్రీలంక చేతిలో పరాజయాన్ని చవిచూసింది. దీంతో అక్తర్ తన యూట్యూబ్ ఛానల్ లో అభిప్రాయాలను వెల్లడించాడు.

భారత్ విజయం సాధించి, ఫైనల్స్ లో పాక్ తో పోటీపడుతుందని తాను అనుకున్నట్టు అక్తర్ చెప్పాడు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది కష్టమేనన్నాడు. భారత్ తుది 11 మంది పరంగా ఎంతో అనిశ్చితి నెలకొన్నట్టు చెప్పాడు. ‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్థాన్ వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోతేనే భారత్ కు అవకాశం ఉంటుంది. ఇది జరుగుతుందని నేను అనుకోవడం లేదు. కానీ, సూపర్ సండే రోజున ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఉంటుందన్న ఆశ అయితే ఉంది’’ అని అక్తర్ పేర్కొన్నాడు. 

భారత్ ఇప్పుడు కెప్టెన్ ను మార్చే తప్పు చేయకూడదన్నాడు అక్తర్. ’’రోహిత్ శర్మ చూడ్డానికి చాలా అసౌకర్యంగా ఉన్నాడు. అతడు సహచరులపై అరుస్తున్నాడు. చివరి మూడు మ్యాచుల్లోనూ తుది 11 మంది ఆటగాళ్ల పరంగా ఎన్నో మార్పులు చేశారు. దీంతో ఎంతో అనిశ్చితి ఉన్నట్టు కనిపిస్తోంది’’ పేర్కొన్నాడు.
Shoaib Akhtar
Team India
asiacup
wakeup call

More Telugu News