Talasani: హుస్సేన్ సాగర్ వద్ద గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తలసాని

Talasani visits Hussain Sagar to observe Ganesh Idols immersion arrangements
  • సెప్టెంబరు 9న గణేశ్ నిమజ్జనం
  • అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయన్న తలసాని
  • కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
  • గణేశ్ మండపాల నిర్వాహకులు ఆందోళన చెందవద్దని సూచన
ఎల్లుండి (సెప్టెంబరు 9) హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జన కార్యక్రమం జరగనుండగా, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హుస్సేన్ సాగర్ వద్ద పర్యటించారు. ట్యాంక్ బండ్ వద్ద గణేశ్ నిమజ్జనం కోసం జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్టీఆర్ మార్గ్ లో క్రేన్ నెం.1 నుంచి ట్యాంక్ బండ్ వరకు ప్రత్యేక వాహనంలో పరిశీలన చేపట్టారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 9వ తేదీన నిర్వహించే గణేశ్ నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తమ ప్రభుత్వం అన్ని పండుగలను ఎంతో ఘనంగా నిర్వహిస్తోందని వివరించారు. 

కానీ కొందరు దేవుళ్లను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేయడం దుర్మార్గం అని తలసాని విమర్శించారు. గణేశ్ మండపాల నిర్వాహకులు తప్పుడు ప్రచారాలను నమ్మి ఆందోళనకు గురికావొద్దని సూచించారు. నిమజ్జనం కోసం సకల ఏర్పాట్లు జరుగుతున్నాయని చూపించేందుకు తాను హుసేన్ సాగర్ వద్ద పర్యటించానని స్పష్టం చేశారు. భక్తులు, ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు. 

మంత్రి తలసాని పర్యటనలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, అధికారులు కూడా పాల్గొన్నారు. కాగా, మంత్రి తలసాని కుమారుడు సాయికిరణ్ నేడు ఖైరతాబాద్ మహాగణపతిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వినాయకుడికి 150 కిలోల భారీ లడ్డూను సమర్పించారు.
.
Talasani
Ganesh Immersion
Hussain Sagar
Hyderabad
TRS
Telangana

More Telugu News