Apple: రూమర్లకు తెర.. ఐఫోన్ 14, యాపిల్ వాచ్ 8, ఎయిర్‌పాడ్స్‌ను లాంచ్ చేసిన యాపిల్.. వివరాలు ఇవిగో
- ఐఫోన్ 14 సిరీస్‌తోపాటు స్మార్ట్‌వాచ్, ఇయర్ బడ్లను ఆవిష్కరించిన యాపిల్
- 90 నిమిషాలపాటు సాగిన ప్రజెంటేషన్
- స్మార్ట్‌ఫోన్లు, వాచ్‌లకు క్రాష్ డిటెక్షన్ ఫీచర్
- ఐఫోన్ 14 ప్రారంభ ధర రూ. 63,700
- ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ ధర రూ. 1,39,900 మాత్రమే
నెలల తరబడి సాగిన రూమర్లకు యాపిల్ చెక్ పెట్టింది. లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేసింది. 90 నిమిషాలపాటు సాగిన ఈ ప్రజెంటేషన్‌లో యాపిల్ సీఈవో టిమ్ కుక్ కీలక ఉపన్యాసం చేశారు. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రొ మోడల్స్‌తోపాటు యాపిల్ వాచ్ 8తోపాటు తన స్మార్ట్‌వాచ్ లైనప్‌లో మరో రెండింటిని తీసుకొచ్చింది.
అలాగే, ఎయిర్‌పార్ట్ ప్రొ 2ను ఆవిష్కరించింది. ఐఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లకు క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌ను జోడించింది. ఫలితంగా, శాటిలైట్ కనెక్టివిటీ ద్వారా ఐఫోన్ నుంచి అత్యవసర సందేశాలను పంపుకోవచ్చు. మెరుగైన అప్‌డేట్లు వినియోగదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఐఫోన్లలో కొత్త చిప్‌సెట్‌ను ఉపయోగించింది. అలాగే, ఫోన్లలో కెమెరా పనితనాన్ని మరింత మెరుగుపర్చింది. యాపిల్ వాచ్‌లో టెంపరేచర్ సెన్సార్, లోపవర్ మోడ్‌ను ఏర్పాటు చేసింది. ఎయిర్‌పాడ్స్ ప్రొ 2లో ఆడియో ఫీచర్‌ను మరింత మెరుగుపర్చింది.
మొత్తంగా చెప్పాలంటే స్మార్ట్‌వాచ్‌ను పూర్తి కొత్తగా తీసుకొచ్చింది. మరీ ముఖ్యంగా అథ్లెట్లు, సాహసికులు, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో పనిచేసేవారిని లక్ష్యంగా చేసుకుని వీటిని లాంచ్ చేసింది. ఆకట్టుకునేలా ఉన్న యాపిల్ వాచ్ ధర గతంలో వచ్చిన పుకార్లంత ఎక్కువగా లేకపోవడం గమనార్హం.
ఐఫోన్ 14 ప్రారంభ ధర 799 డాలర్లు (దాదాపు రూ.63,700) మాత్రమే. ఐఫోన్ 14 ప్లస్ 899 డాలర్లు (రూ. 71,600). బ్లూ, మిడ్‌నైట్, పర్పుల్, స్టార్‌లైట్, రెడ్ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 14 ముందస్తు ఆర్డర్లు రేపటి నుంచి ప్రారంభం అవుతాయి. ఈ నెల 16 నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ఐఫోన్ 14 ప్లస్ అక్టోబరు 7 నుంచి సేల్‌కు అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ 14, 14 ప్లస్ ధరలు ఇండియాలో వరుసగా రూ. 79,900, రూ.89,900గా యాపిల్ పేర్కొంది.
ఐఫోన్ 14 ప్రొ ప్రారంభ ధర 999 డాలర్లు (రూ.79,555). ఈ లైన్‌లో టాప్ ఫోన్ అయిన ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ధర 1,099 డాలర్లు (రూ.87,530). వీటి ముందస్తు ఆర్డర్లు కూడా రేపటి నుంచే ప్రారంభమవుతాయి. సెప్టెంబరు 16 నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. డీప్ పర్పుల్, గోల్డ్, సిల్వర్, స్పేస్ బ్లక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. ఇండియాలో వీటి ధరలు వరుసగా రూ.1,29,900, రూ.1,39,900. యాపిల్ ఆన్‌లైన్ స్టోర్లతోపాటు యాపిల్ ఆథరైజ్డ్ రీసెల్లర్ల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు.
ఐఫోన్ 14 స్పెసిఫికేషన్లు
ఫ్లాట్ ఎడ్జ్ ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్‌తో వచ్చిన ఈ ఫోన్ ముందుభాగంలో సిరామిక్ షీల్డ్ మెటీరియల్ ఉపయోగించారు. ఐపీ 68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్. 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓలెడ్ డిస్‌ప్లే. డాల్బీ విజన్‌కు 1200నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, సపోర్టును అందిస్తుంది. ఫోన్ అన్‌లాక్ కోసం ఫేస్ ఐడీ ఫీచర్ ఉంది. అలాగే, ముందు వెనక 12 ఎంపీ కెమెరా ఉంది. ర్యామ్, బ్యాటరీ వివరాలు వెల్లడి కాలేదు.
ఐఫోన్ 14 ప్లస్ స్పెసిఫికేషన్లు
6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓలెడ్ డిస్‌ప్లే ఉంది. బ్యాటరీ బ్యాకప్ మినహా మిగతా ఫీచర్లన్నీ దాదాపుగా ఐఫోన్ 14 లానే ఉన్నాయి. హుడ్ కింద ఎ15 బయోనిక్ ఎస్ఓసీని ఉపయోగించారు. కెమెరా సెటప్ కూడా ఐఫోన్ 14లానే ఉంది.
ఐఫోన్ 14 ప్రొ స్పెసిఫికేషన్లు
ప్రొ మోడళ్లలో యాపిల్‌లో సర్జికల్ గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్‌ను ఉపయోగించారు. ఇది తప్పును నిరోధిస్తుంది. 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఆల్వేస్-ఆన్ ఓలెడ్ డిస్‌ప్లే, ట్రెండ్ సెట్టింగ్ నాచ్ స్థానంలో పిల్ ఆకారంలో హోల్ పంచ్ కటౌట్‌ను పరిచయం చేశారు. యాపిల్ దీనిని డైనమిక్ ఐలాండ్ అని పిలుస్తోంది. హుడ్ కింద ఏ16 బయోనిక్ ఎస్ఓసీ ఉంది. స్మార్ట్‌ఫోన్లలో ఇదే అత్యంత శక్తిమంతమైన చిప్‌గా చెబుతున్నారు. ముందు వెనక 48 ఎంపీ, 12 ఎంపీ కెమెరాలను ఉపయోగించారు.
ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ స్పెసిఫికేషన్లు
ఇందులో ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ హార్డ్‌వేర్‌నే ఉపయోగించారు. అయితే, డిస్‌ప్లే మాత్రం దాని కంటే కొంచెం పెద్దది. ఇందులో 6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓలెడ్ డిస్‌ప్లే ఉంది. మిగతావన్నీ దాదాపు ఒకటే.