Social Media: సోషల్ మీడియా ప్రభావితులు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే రూ. 10 లక్షల జరిమానా: సిద్ధమవుతున్న కొత్త మార్గదర్శకాలు
- మరో 15 రోజుల్లోనే కొత్త మార్గదర్శకాలు!
- నిబంధనలు పదే పదే ఉల్లంఘిస్తే రూ. 50 లక్షల జరిమానా
- బ్రాండ్లను ఎండార్స్ చేసేవారు, సోషల్ మీడియాను ప్రభావితం చేసే వారే లక్ష్యం
- ప్రజలను తప్పుదోవ పట్టించే వారి నుంచి కాపాడడమే లక్ష్యంగా మార్గదర్శకాలు
సామాజిక మాధ్యమాలు చేతిలో ఉన్నాయి కదా అని ఇకపై ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తామంటే కుదరదు. మరో రెండు వారాల్లో కొత్త మార్గదర్శకాలు రాబోతున్నాయి. ఏదైనా బ్రాండ్‌కు ప్రచారం చేసే, ప్రభావితం చేసే వ్యక్తులు (ఇన్‌ఫ్లుయెన్సర్లు) స్పష్టమైన, వాస్తవ సమాచారాన్ని మాత్రమే అందించాల్సి ఉంది. అలాగే ఈ-కామర్స్ సైట్లలో ఆయా వస్తువులపై రివ్యూలు రాసేవారు కూడా ఇకపై వాస్తవ దృక్పథంతోనే రాయాల్సి ఉంటుంది.
ఒకవేళ ఉల్లంఘిస్తే రూ. 10 లక్షల జరిమానా చెల్లించుకోక తప్పదు. నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తే మాత్రం రూ.50 లక్షల జరిమానా విధిస్తారు. సెలబ్రిటీ ఎవరైనా సరే ఈ జరిమానా కట్టి తీరాల్సిందే. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరో 15 రోజుల్లో ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (ఎస్ఓపీ) పేరిట విడుదల చేయనుంది.
తప్పుదోవ పట్టించే ప్రకటనల నుంచి ప్రజలను రక్షించేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. బ్రాండ్‌ను ఎండార్స్ చేసేవారు, సోషల్ మీడియాను ప్రభావితం చేసేవారు, బ్లాగర్లను దీనికిందకు తీసుకురానుంది. అంతేకాదు, వస్తువులను ఉచితంగా తీసుకుని వాటిని ప్రచారం చేసేవారు, పొందిన వస్తువులకు ముందుగా 10 శాతాన్ని టీడీఎస్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ తీసుకున్న వస్తువులను మళ్లీ తిరిగి వారికి అప్పగిస్తే కనుక సెక్షన్ 194 కింద ఆ మొత్తాన్ని తిరిగి పొందొచ్చు.