AIADMK: అన్నాడీఎంకే.. డీఎంకే మధ్య వలసల పోరు
- 10 మంది డీఎంకే ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న పళనిస్వామి
- 50 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తమను సంప్రదించారన్న డీఎంకే ఎంపీ భారతీ
- డీఎంకేనే అసలైన ద్రవిడ పార్టీ అని వ్యాఖ్య
తమిళనాట అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు వలసలపై దృష్టి పెట్టాయి. పోటా పోటీగా మైండ్ గేమ్ ఆడుతున్నాయి. 10 మంది డీఎంకే ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు చేస్తున్నారంటూ.. అన్నాడీఎంకే తాత్కాలిక జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు. దీనికి డీఎంకే ఎంపీ, పార్టీ ఆర్గనైజేషనల్ సెక్రటరీ ఆర్ ఎస్ భారతీ సైతం దీటుగా స్పందించారు. పలువురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని ప్రకటించారు.
‘‘అన్నాడీఎంకేకు చెందిన 50 మంది ఎమ్మెల్యేలు, 30 మంది జిల్లా సెక్రటరీలు, ఇద్దరు ఎంపీలు మాతో సంప్రదింపులు చేస్తున్నారు. డీఎంకే నుంచి ఎవరు సంప్రదిస్తున్నారో వారి పేర్లతో పళనిస్వామి జాబితా విడుదల చేస్తే.. మాతో సంప్రదింపులు చేస్తున్నవారి వివరాలను నేను కూడా వెల్లడిస్తా’’ అని ఆర్ఎస్ భారతీ పేర్కొన్నారు. డీఎంకేనే అసలైన ద్రవిడ ఉద్యమ పార్టీ అంటూ.. అన్నాడీఎంకేకు చెందిన అందరూ వచ్చి డీఎంకేలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు.