Telangana: మూడేళ్లుగా మహిళా గవర్నర్‌ను వివక్షకు గురి చేశారు: తమిళిసై సౌందరరాజన్
- గవర్నర్‌గా మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న తమిళిసై
- రాజ్ భవన్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన గవర్నర్
- కొన్ని విషయాలు బయటకు చెప్పుకోలేనన్న తమిళిసై
- ఎన్ని అడ్డంకులున్నా ముందుకే సాగుతానని వెల్లడి
తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్‌గా మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం రాజభవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తమిళిసై... మరోమారు టీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. మూడేళ్ల పాటు మహిళా గవర్నర్‌గా తనను ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేసిందని ఆమె ఆరోపించారు. ఈ మూడేళ్లుగా మహిళా గవర్నర్‌ను వివక్షకు గురి చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గవర్నర్ పదవికి ఇవ్వాల్సిన ప్రొటోకాల్‌ను కూడా తనకు ఇవ్వలేదని ఆమె వ్యాఖ్యానించారు.
తనకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందుకే సాగుతానని తమిళిసై అన్నారు. తనకు సన్మానం జరగకపోయినా తన కృషిలో మార్పు ఉండదని చెప్పారు. తనకు గౌరవం ఇవ్వకపోయినా తనకెలాంటి ఇబ్బంది లేదని కూడా ఆమె పేర్కొన్నారు. అడ్డంకులున్నా నిర్మలమైన మనస్సుతో ముందుకు సాగుతానని తెలిపారు. కొన్ని విషయాలను బయటకు చెప్పుకోలేనని కూడా ఆమె వ్యాఖ్యానించారు.
గవర్నర్‌గా ప్రజల వద్దకు వెళ్లాలనుకుంటే...ఏదో ఒక ఇబ్బంది ఎదురైందన్నారు. మేడారం వెళ్లడానికి హెలికాప్టర్ అడిగితే ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. రాజ్ భవన్ విషయంలో అధికారులు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు. గణతంత్ర దినోత్సవంలోనూ తనను దూరం పెట్టారన్నారు. ఏదైనా సమస్య ఉంటే చర్చించి, పరిష్కరించుకోవాల్సి ఉందని ఆమె అన్నారు.