Telangana: గవర్నర్ పదవి ఓ నామినేటెడ్ పోస్ట్: జగ్గారెడ్డి
- ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవితో గవర్నర్ పోస్ట్ సమానమన్న జగ్గారెడ్డి
- గవర్నర్ కంటే సీఎం పోస్టుకే పవర్ ఎక్కువ అని వ్యాఖ్య
- కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీ వారే గవర్నర్లుగా వస్తారని కామెంట్
గవర్నర్ పదవిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గవర్నర్‌గా మూడేళ్ల పదవీ కాలాన్ని ముగించుకున్న నేపథ్యంలో గురువారం రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన క్రమంలో గవర్నర్ పదవిపై జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ పదవిని ఆయన ఓ నామినేటెడ్ పోస్ట్ అంటూ కామెంట్ చేశారు.
గవర్నర్ పదవి కంటే సీఎం పోస్టుకే పవర్ ఎక్కువ అని జగ్గారెడ్డి అన్నారు. గవర్నర్ పదవి ఓ నామినేటెడ్ పోస్ట్ అన్న జగ్గారెడ్డి... ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యుడి పదవితో గవర్నర్ పదవి సమానమని వ్యాఖ్యానించారు. కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉంటే... ఆ పార్టీకి చెందిన వారే గవర్నర్లుగా వస్తారని ఆయన అన్నారు. తెలంగాణలో ప్రభుత్వం టీఆర్ఎస్‌ది, గవర్నరేమో బీజేపీకి చెందిన వారు కావడంతోనే సమస్య వచ్చిందని అన్నారు.