Shoaib Akhtar: స్టేడియంలో పాక్, ఆఫ్ఘన్ అభిమానుల మధ్య కొట్లాట నేపథ్యంలో... ట్విట్టర్ లో అక్తర్, షఫీక్ మధ్య పోట్లాట!

Afghan former cricket chief gave fitting reply to Pakistan former pacer Shoaib Akhtar
  • నిన్న ఆసియా కప్ సూపర్-4లో పాక్ వర్సెస్ ఆఫ్ఘన్
  • ఉత్కంఠ పోరులో పాక్ గెలుపు
  • పాక్ అభిమానులను ఉతికారేసిన ఆఫ్ఘన్ ఫ్యాన్స్
  • పెద్దమనిషిలా సలహా ఇచ్చే ప్రయత్నం చేసిన అక్తర్
  • దేశం పేరును ప్రస్తావించొద్దన్న స్తనిక్ జాయ్
షార్జాలో నిన్న పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్ కొదమసింహాల మధ్య పోరును తలపించింది. ఈ మ్యాచ్ లో పాక్ బ్యాట్స్ మన్ ఆసిఫ్ అలీకి, ఆఫ్ఘన్ ఆటగాళ్లకు మధ్య వివాదం జరగ్గా, ఇరుదేశాల అభిమానుల మధ్య స్టేడియంలో ఘర్షణ చోటుచేసుకుంది ఆఫ్ఘన్ అభిమానులు కుర్చీలతో కొట్టడంతో పాక్ అభిమానులు పరుగులు తీయడం వీడియోల్లో కనిపించింది. 

ఈ నేపథ్యంలో, పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తీవ్ర వ్యాఖ్యలు చేయగా, ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ చీఫ్ షఫీక్ స్తనిక్ జాయ్ అదేస్థాయిలో బదులిచ్చారు. కొట్లాట వీడియోను పంచుకున్న అక్తర్... 'ఆఫ్ఘన్ అభిమానులు ఏంచేస్తున్నారో చూడండి' అంటూ షఫీక్ స్తనిక్ జాయ్ ని ఉద్దేశించి ట్వీట్ చేశాడు. 

"ఆఫ్ఘనిస్థాన్ అభిమానులకు ఇదేమీ కొత్త కాదు. వారు గతంలో అనేక పర్యాయాలు ఇలా కొట్లాటకు దిగారు. ఇదొక మ్యాచ్. ఆటగాళ్లు మైదానంలో ఆడేందుకు సంబంధించినది. సరైన స్ఫూర్తిని ప్రదర్శించాల్సి ఉంటుంది. స్తనిక్ జాయ్... ఈ క్రీడలో ఎదగాలంటే మీ అభిమానులు, మీ ఆటగాళ్లు కొన్ని విషయాలు నేర్చుకోవాలి" అంటూ అక్తర్ పెద్దమనిషిలా హితవు చెప్పే ప్రయత్నం చేశాడు. 

అందుకు స్తనిక్ జాయ్ బదులిస్తూ... "అభిమానుల భావోద్వేగాలను ఎవరైనా అదుపు చేయగలరా? ప్రపంచ క్రికెట్లో అనేకసార్లు ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. నువ్వోసారి కబీర్ ఖాన్, ఇంజిమామ్ భాయ్, రషీద్ లతీఫ్ లను అడుగు... వాళ్లను మేం ఎలా చూసుకున్నామో! నీకు నేనిచ్చే సలహా ఏంటంటే... అభిమానులు చేసిన దానికి దేశం మొత్తానికి ఆపాదించవద్దు... ఈసారి మాట్లాడే ముందు నేనిచ్చిన సలహాను పాటిస్తావని ఆశిస్తున్నా" అంటూ స్పందించాడు.
Shoaib Akhtar
Shafiq Stanikzai
Pakistan
Afghanistan
Fans
Asia Cup

More Telugu News