Amaravati: మునిసిపాలిటీగా అమరావతి... 22 గ్రామాల అభిప్రాయాల కోసం కలెక్టర్కు ఏపీ సర్కారు ఆదేశాలు
- తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని 22 గ్రామాలతో మునిసిపాలిటీ ప్రతిపాదన
- గ్రామ సభల నిర్వహణకు గుంటూరు జిల్లా కలెక్టర్కు ఆదేశాలు
- గతంలో మునిసిపల్ కార్పొరేషన్ ప్రతిపాదనలను తిరస్కరించిన 29 గ్రామాలు
- 29 గ్రామాలతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నాడు గ్రామాల తీర్మానాలు
ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని 22 గ్రామాలతో అమరావతి మునిసిపాలిటీని ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తుళ్లూరు, మంగళగిరి మండలాల పరిధిలోని 22 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ఆయా గ్రామాల ప్రజల అభిప్రాయాలను సేకరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్కు ఏపీ పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు ఆయా గ్రామాల్లో గ్రామ సభల కోసం కలెక్టర్ నోటీసులు జారీ చేశారు.
ఇదిలా ఉంటే... ఇప్పుడు ప్రతిపాదించిన 22 గ్రామాలతోనే అమరావతి మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా గతంలో ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆ మేరకు 22 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించగా... ఆయా గ్రామ సభలు ఈ ప్రతిపాదనలకు తిరస్కరించాయి. 22 గ్రామాలతో కాకుండా రాజధాని గ్రామాలుగా పరిగణిస్తున్న మొత్తం 29 గ్రామాలతో మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటూ ఆయా గ్రామాలు ఏకగ్రీవంగా తీర్మానాలు ఆమోదించి ప్రభుత్వానికి పంపాయి. ఆ ప్రతిపాదనలను పక్కనబెట్టిన రాష్ట్ర ప్రభుత్వం అవే 22 గ్రామాలతో ఇప్పుడు మునిసిపాలిటీ దిశగా కసరత్తు మొదలుపెట్టడం గమనార్హం.