Telangana: సీఎంపై ఆరోపణలు చేయడం గవర్నర్‌కు ఫ్యాషన్ గా మారింది: మంత్రి జగదీశ్ రెడ్డి
- కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించిన తమిళిసై
- తమిళిసై వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి జగదీశ్ రెడ్డి
- నిత్యం వార్తల్లో ఉండేందుకే గవర్నర్ తాపత్రయమని ఆరోపణ
తెలంగాణ సర్కారుపై విమర్శలు గుప్పించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై టీఆర్ఎస్ నేతలు ఎదురు దాడి ప్రారంభించారు. రాష్ట్ర గవర్నర్‌గా మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం రాజ్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ సర్కారుపై తమిళిసై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలపై తాజాగా టీఆర్ఎస్ కీలక నేత, మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు.
సీఎం కేసీఆర్‌పైనా, రాష్ట్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం గవర్నర్ కు ఫ్యాషన్ గా మారిందని జగదీశ్ రెడ్డి అన్నారు. ఈ తరహా పధ్ధతి సరైనది కాదన్న మంత్రి.. నిత్యం వార్తల్లో ఉండేందుకు గవర్నర్ ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజ్ భవన్‌ను ఉపయోగించుకుని గవర్నర్ బీజేపీకి లబ్ది చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.
రాజ్యాంగబద్ధ సంస్థలను గౌరవించడంలో కేసీఆర్ వంటి పరిణతి చెందిన నాయకుడు మరొకరు లేరని ఆయన తెలిపారు. గౌరవంగా రాజ్ భవన్‌ను నడపాల్సిన గవర్నర్ రాజకీయాలు చేయడం ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. దేశంలో ప్రధాని, రాష్టపతి తరహాలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా పాలన సాగుతోందని జగదీశ్ రెడ్డి తెలిపారు.