Andhra Pradesh: జగన్కు భారీ ఊరట... సీబీఐ కేసుల విచారణ తర్వాతే ఈడీ కేసులన్న తెలంగాణ హైకోర్టు
- జగన్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదు చేసిన సీబీఐ, ఈడీ
- తొలుత సీబీఐ కేసులపై విచారణ చేపట్టాలన్న జగన్
- తొలుత ఈడీ కేసులపైనే విచారణ చేపడతామన్న సీబీఐ ప్రత్యేక కోర్టు
- సీబీఐ కోర్టు తీర్పును తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసిన విజయసాయిరెడ్డి తదితరులు
- సీబీఐ కోర్టు తీర్పును కొట్టివేస్తూ హైకోర్టు నిర్ణయం
- సీబీఐ కేసులు కొట్టివేతకు గురైతే ఈడీ కేసులే ఉండబోవని వ్యాఖ్య
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గురువారం భారీ ఊరట లభించింది. జగన్పై నమోదైన సీబీఐ, ఈడీ కేసుల్లో తొలుత సీబీఐ కేసులపైనే విచారణ జరపాలని, ఆ తర్వాతే ఈడీ కేసులపై విచారణ సాగించాలని తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలకు సంబంధించి జగన్పై తొలుత సీబీఐ కేసులు నమోదు చేయగా... ఆ కేసుల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో ఇప్పటికే చార్జిషీట్లు దాఖలు కాగా... ఈ కేసులపై తుది విచారణలు నాంపల్లిలో కోర్టులో మొదలు కావాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో తొలుత సీబీఐ కేసులపై విచారణ సాగాలని, ఆ తర్వాత ఈడీ కేసులపై విచారణ సాగాలని జగన్ సహా ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు సీబీఐ కేసుల కంటే ముందుగా ఈడీ కేసులపైనే విచారణ చేపట్టనున్నట్లు తీర్పు చెప్పింది. ఈ తీర్పును విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశాయి.
ఈ పిటిషన్లపై ఇప్పటికే విచారణ ముగించిన హైకోర్టు గురువారం కీలక తీర్పు చెప్పింది. ఈ వ్యవహారంలో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా ఈడీ కేసుల కంటే ముందుగా సీబీఐ కేసులపైనే విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ రెండు దర్యాప్తు సంస్థలు నమోదు చేసిన కేసులపై ఒకేసారి విచారణ జరిగితే... తొలుత సీబీఐ కేసుల్లో తీర్పు వెలువరించిన తర్వాతే ఈడీ కేసుల్లో తీర్పు వెలువరించాలని సూచించింది. సీబీఐ కేసులు కొట్టివేతకు గురైతే... ఈడీ కేసులే ఉండబోవని కూడా హైకోర్టు అభిప్రాయపడింది.