Team India: సోషల్ మీడియాలో కోహ్లీపై ప్రశంసల వెల్లువ... గ్రీటింగ్స్ చెప్పిన కేటీఆర్
- ఆఫ్ఘన్‌తో మ్యాచ్‌లో చెలరేగిన కోహ్లీ
- 61 బంతుల్లో 122 పరుగులతో అజేయంగా నిలిచిన స్టార్ క్రికెటర్
- మొత్తంగా 71 సెంచరీలు చేసిన కోహ్లీ
- అత్యధిక శతకాలు బాదిన రెండో క్రికెటర్‌గా గుర్తింపు
మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీతో అదరగొట్టాడు. ఫామ్ లేమితో సతమతమవుతున్న కోహ్లీపై విమర్శల వర్షం కురుస్తుండగా...వాటి నుంచి తప్పించుకునేందుకు కోహ్లీ నానా తంటాలే పడ్డాడు. అయితే ఆసియా కప్‌లో భాగంగా గురువారం ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన కోహ్లీ శతకంతో చెలరేగిపోయాడు.
మొత్తం 61 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 122 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లీ స్కోరులో 12 ఫోర్లు, 6 సిక్సులు ఉండటం గమనార్హం. ఈ శతకంతో తన కెరీర్‌లో 71 శతకాలు చేసిన క్రికెటర్‌గా కోహ్లీ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. 100 సెంచరీలు నమోదు చేసిన సచిన్ టెండూల్కర్ తర్వాత ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌తో కలిసి 71 శతకాలతో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.
ఈ క్రమంలో కోహ్లీని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టుల వరద పారుతోంది. భారత్‌కు చెందిన క్రికెటర్లు, మాజీ క్రికెటర్లే కాకుండా దాదాపుగా అన్ని దేశాలకు చెందిన క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు కోహ్లీని ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఫలితంగా కోహ్లీకి ప్రశంసలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.
ఇందులో భాగంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా కోహ్లీని ఆకాశానికి ఎత్తేస్తూ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 71 సెంచరీలు, టీ20ల్లో తొలి సెంచరీ నమోదు చేసిన కోహ్లీకి అభినందనలు అంటూ కేటీఆర్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.