Virat Kohli: తన 71వ సెంచరీని ఆ ఇద్దరికి అంకితం చేసిన కోహ్లీ
- ఆఫ్ఘనిస్థాన్ పై శతకంతో విరుచుకుపడ్డ విరాట్
- 1020 రోజుల తర్వాత సెంచరీ కొట్టిన స్టార్ క్రికెటర్
- భార్య అనుష్క, కూతురు వామికకు అంకితం చేసినట్లు వెల్లడి
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చాన్నాళ్ల తర్వాత మునపటి ఫామ్ ను అందుకున్నాడు. ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ పై విరాట్ 61 బంతుల్లో 122 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 1020 రోజుల నిరీక్షణ తర్వాత సెంచరీ సాధించాడు. కోహ్లీ కెరీర్లో ఇది 71వ అంతర్జాతీయ సెంచరీ కాగా.. టీ20 ఫార్మాట్ లో అతనికి ఇదే మొదటిది. ఈ ప్రత్యేక శతకాన్ని విరాట్ తన భార్య అనుష్క శర్మ, ముద్దుల కూతురు వామికాకు అంకితం చేశాడు. కెప్టెన్‌గా వైదొలిగిన తర్వాత అనేక విషయాల్లో భార్య అనుష్క తనకు సహాయపడిందని చెప్పాడు.
‘బయట చాలా విషయాలు జరుగుతున్నాయని నాకు తెలుసు. కానీ అవి నా దృక్పథాన్ని ఏ మాత్రం మార్చలేవు. సెంచరీ చేసిన తర్వాత నా ఉంగరాన్ని (పెళ్లి ఉంగరం) ముద్దాడాను. నేను ప్రస్తుతం ఇలా నిలబడటం మీరు చూస్తున్నారు. ఇందుకు కారణమైన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఈ క్లిష్ట సమయాల్లో నాకు అండగా నిలిచిన ఒక వ్యక్తి నా భార్య అనుష్క. ఈ సెంచరీని ప్రత్యేకంగా అనుష్కకు, మా కూతురు వామికకు అంకితం చేస్తున్నా. ప్రతి ఒక్కరికి తమ పక్కనే నిలబడి, మంచి చెడుల్లో భాగం అయ్యేవారు ఒకరు ఉండాలి. అలా నా జీవితంలో అనుష్క ఉంది. తను క్లిష్ట సమయాల్లో నా వెన్నంటే నిలిచింది. ఆటకు దూరంగా ఉన్నప్పుడు నన్ను ప్రోత్సహిస్తూ.. నన్ను సరైన దృక్కోణంలో ఉంచింది‘ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
ఎప్పుడు సెంచరీ చేసినా.. గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకునే విరాట్ ఈ సారి అందుకు భిన్నంగా ప్రశాంతంగా కనిపించాడు. దీని గురించి చెబుతూ, ‘గత రెండున్నరేళ్లు నాకు చాలా నేర్పించాయి. నవంబర్‌లో నేను 34 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నాను. ఈ సెంచరీ నాకు దక్కిన ఆశీర్వాదంగా భావిస్తున్నా. ఈ ఫార్మాట్ లో సెంచరీ ఊహించనే లేదు కాబట్టి నేను ఒకింత షాక్ అయ్యాను. ఇదంతా దేవుడి ఆశీర్వాదం. నేను కష్టపడి పని చేస్తున్నాను. ఈ సెంచరీ నాకు, నా టీమ్‌కి కూడా చాలా ప్రత్యేకమైనది‘ అని విరాట్ పేర్కొన్నాడు.