Andhra Pradesh: పరిపాలన రాజధానిని వైజాగ్ తీసుకెళ్లడం తథ్యం: కొడాలి నాని
- టీడీపీని 23 సీట్లకు పరిమితం చేసినా చంద్రబాబుకు బుద్ధి రాలేదన్న నాని
- రూ.10 వేల కోట్లు పెడితే విశాఖలో సంపద సృష్టించవచ్చని వెల్లడి
- వైజాగ్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయన్న మాజీ మంత్రి
- అమరావతిని మహా నగరాలతో పోల్చి ప్రజలకు చంద్రబాబు ఆశలు కల్పిస్తున్నారని ఆరోపణ
పరిపాలన రాజధానిని వైజాగ్ తీసుకెళ్లడం తథ్యమంటూ తాజాగా మీడియా ముందుకు వచ్చిన మాజీ మంత్రి కొడాలి నాని కీలక ప్రకటన చేశారు. పరిపాలన రాజధాని విశాఖతో పాటు న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి వుంటాయని ఆయన తేల్చి చెప్పారు.
ఈ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని లక్ష్యంగా చేసుకుని కొడాలి నాని పలు వ్యాఖ్యలు చేశారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని ఆయన చెప్పారు. వైజాగ్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
విశాఖలో కేవలం రూ.10 వేల కోట్లు పెడితే సంపద సృష్టించవచ్చన్నారు. అమరావతిని మహా నగరాలతో పోల్చి చంద్రబాబు ప్రజలకు ఆశలు కల్పిస్తున్నారని ఆరోపించారు. 29 నియోజకవర్గాలు ఉన్న రాజధాని ఎక్కడ? అని ప్రశ్నించిన నాని... 29 గ్రామాలున్న అమరావతి ఎక్కడ అని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో టీడీపీని 23 సీట్లకే పరిమితం చేసినా చంద్రబాబుకు బుద్ధి రాలేదన్నారు.