Ravindra Jadeja: వికటించిన జలక్రీడ.... గాయంతో టీ20 వరల్డ్ కప్ కు దూరమైన రవీంద్ర జడేజా

Jadeja out of T20 World Cup due to knee injury

  • ఆసియా కప్ సందర్భంగా జడేజాకు గాయం
  • ముంబయిలో శస్త్రచికిత్స
  • గాయం వెనుక కథ ఇప్పుడు వెల్లడైన వైనం
  • దుబాయ్ లో అడ్వెంచర్ స్పోర్ట్స్ కు వెళ్లిన జడేజా
  • తీవ్రస్థాయిలో మోకాలుకు గాయం 

ఆసియా కప్ సందర్భంగా గాయపడిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే. అయితే, సాధన చేస్తుండగా గాయపడ్డాడని అందరూ భావించారు. ఆ గాయానికి శస్త్రచికిత్స కూడా జరగడంతో గాయం తీవ్రమైనదే అని అందరికీ అర్థమైంది. అయితే ఆ గాయం ఎలా తగిలిందో ఇప్పుడు వెల్లడైంది. అంతేకాదు, గాయం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టనుండడంతో, వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ కు కూడా జడేజా దూరమయ్యాడు. 

ఇంతకీ, ఆ గాయం ఎలా తగిలిందంటే... ఆసియా కప్ సందర్భంగా టీమిండియా దుబాయ్ లోని ఓ స్టార్ హోటల్ లో బస చేసింది. దుబాయ్ సముద్ర జలాల్లో జలక్రీడలకు వెళ్లిన జడేజా తీవ్రంగా గాయపడ్డాడు. అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ లో స్కీబోర్డ్ జలక్రీడను ఎంజాయ్ చేసేందుకు వెళ్లిన జడేజాకు మోకాలుకు దెబ్బ తగిలింది. ఆ గాయం తీవ్రమైనది కావడంతో జడేజా ముంబయి వచ్చి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. 

ఈ నేపథ్యంలో, జడేజాపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు వెల్లడైంది. ఓవైపు ఆసియా కప్ జరుగుతుండగా, మరికొన్ని రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ఉండగా, అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ లో పాల్గొనేందుకు వెళ్లడం అవసరమా? అంటూ బోర్డు వర్గాలు అతడిపై మండిపడ్డాయి. టీమిండియాలో ఎంతో కీలకమైన ఆటగాడు నిర్లక్ష్యపూరితంగా జలక్రీడలకు వెళ్లడం ఏంటని తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి. 

ఆసియా కప్ లో పాకిస్థాన్ పై గ్రూప్ దశలో సాధించిన విజయంలో జడేజాది కీలకపాత్ర. ఆ తర్వాత అతడు జట్టుకు దూరం కాగా, టీమిండియా కూడా పరాజయాల బాటలో పయనించి టోర్నీ నుంచి నిరాశాజనక రీతిలో నిష్క్రమించింది. ఆఖరి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ పై ఘనంగా గెలిచినా ఆ మ్యాచ్ కు ఏమాత్రం ప్రాధాన్యతలేదు. 

ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... జడేజా గాయంపై చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ సందేశం పంపింది. జడ్డూ... నువ్వు త్వరగా కోలుకోవాలి. నీకు మరింత శక్తి కలగాలి అంటూ సీఎస్కే ట్వీట్ చేసింది. గత ఐపీఎల్ సీజన్ సందర్భంగా చెన్నై వరుస ఓటముల నేపథ్యంలో కెప్టెన్ గా ఉన్న జడేజా ప్రత్యేక పరిస్థితుల్లో బాధ్యతల నుంచి, జట్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దాంతో అందరూ జడేజాకు, సీఎస్కే యాజమాన్యానికి చెడిందని భావించారు. 

ఆ తర్వాత జడేజాను చెన్నై ఇన్ స్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసిందని, జడేజాకు అన్ ఫాలో చేశాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు జడేజా కాలికి శస్త్రచికిత్స చేయించుకున్న ఫొటోను పోస్టు చేయడం ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ అతడిపై తమ అభిమానాన్ని చాటింది.

  • Loading...

More Telugu News