TATA Group: భారత్ లో ఐఫోన్ అసెంబ్లింగ్ పట్ల టాటా గ్రూప్ ఆసక్తి
- విస్ట్రాన్ కార్ప్ తో చర్చలు
- ఒప్పందం కుదిరితే టాటా-విస్ట్రాన్ జాయింట్ వెంచర్
- ఐఫోన్లను అసెంబ్లింగ్ చేస్తున్న విస్ట్రాన్ కార్ప్
- అసెంబ్లింగ్ యూనిట్ కోసం టాటా గ్రూప్ ప్రయత్నాలు
అనేక ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు తమ ఫోన్లను ఇతర కంపెనీలతో తయారు చేయిస్తాయని తెలిసిందే. పలు కంపెనీలతో విడిభాగాలను రూపొందించి అసెంబ్లింగ్ చేయడం పెద్ద పరిశ్రమగా రూపుదాల్చింది. ఫాక్స్ కాన్, విస్ట్రాన్ కార్ప్ వంటి ఈ రంగంలో పేరెన్నికగన్న సంస్థలు. ఇవి రెండు కూడా తైవాన్ కంపెనీలే. ఇవి అత్యంత ప్రజాదరణ పొందిన ఐఫోన్లను తయారుచేస్తున్నాయి.
ఇప్పుడు టాటా గ్రూప్ కూడా భారత్ లో ఎలక్ట్రానిక్స్ భాగాల తయారీని చేపట్టేందుకు ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఈ దిశగా విస్ట్రాన్ కార్ప్ తో చేతులు కలిపేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం టాటా గ్రూప్, విస్ట్రాన్ కార్ప్ మధ్య చర్యలు జరుగుతున్నాయి. ఒప్పందం కుదిరితే, ఈ రెండు సంస్థలు భారత్ లో సంయుక్తంగా ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నెలకొల్పుతాయి. తద్వారా టాటా గ్రూప్ ఐఫోన్ తయారీ చేపట్టే తొలి భారతీయ కంపెనీగా అవతరిస్తుంది.
టాటా గ్రూప్ భారత్ లో ఉప్పు మొదలుకుని సాఫ్ట్ వేర్ రంగం వరకు అనేక వ్యాపారాలు చేస్తోంది. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ రంగంలోనూ సత్తా చాటాలని కృతనిశ్చయంతో ఉంది. అందుకే, ప్రొడక్ట్ డెవలప్ మెంట్, గొలుసుకట్టు సరఫరా, అసెంబ్లింగ్ రంగాల్లో నైపుణ్య సంస్థగా కొనసాగుతున్న విస్ట్రాన్ కార్ప్ తో భాగస్వామ్యం కోరుకుంటోంది. ఈ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ స్థాపన జరిగితే, ఎలక్ట్రానిక్స్ రంగంలో చైనాకు దీటుగా నిలవాలన్న భారత్ ప్రయత్నాలకు మరింత బలం చేకూరుతుంది.