F-16: ఎఫ్-16 యుద్ధ విమానాల విడిభాగాలను పాకిస్థాన్ కు సాయం కింద ఇవ్వడంలేదు... విక్రయిస్తున్నాం: అమెరికా

US clarifies Biden govt decision to sale F16 equipment to Pakistan
  • 450 మిలియన్ డాలర్ల ఒప్పందానికి బైడెన్ ఆమోదం
  • పాకిస్థాన్ కు ఎఫ్-16 విమానాల విడిభాగాల సరఫరా
  • నిర్వహణపరమైన మద్దతు అందజేత
  • భారత్ నుంచి ఆందోళన.. వివరణ ఇచ్చిన అమెరికా
పాకిస్థాన్ కు 450 మిలియన్ డాలర్ల విలువ చేసే ఎఫ్-16 యుద్ధ విమానాల విడిభాగాలను ఇవ్వాలని అమెరికా నిర్ణయించిన సంగతి తెలిసిందే. భారత్ ప్రభుత్వంలో దీనిపై ఆందోళన నెలకొన్న విషయాన్ని గుర్తించిన అమెరికా ప్రభుత్వం మరింత స్పష్టతనిచ్చింది. 

తాము ఈ అత్యాధునిక పోరాట విమానాల విడిభాగాలను పాకిస్థాన్ కు సాయం కింద ఇవ్వడంలేదని, విక్రయిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి (దక్షిణాసియా, మధ్య ఆసియా వ్యవహారాలు) డొనాల్డ్ లూ వెల్లడించారు. ఇప్పటికే పాకిస్థాన్ వద్ద ఉన్న ఎఫ్-16 విమానాలకు అవసరమైన విడిభాగాలను మాత్రమే అందిస్తున్నామని స్పష్టం చేశారు. 

తాము విక్రయించిన వ్యవస్థలు ప్రపంచంలో ఎక్కడున్నా వాటికి నిర్వహణ సేవలు అందించడం, విడిభాగాలకు సంబంధించిన మద్దతు ఇవ్వడం అమెరికా విధానం అని ఉద్ఘాటించారు. ఈ విధానం విడిభాగాలు, నిర్వహణ వరకే పరిమితమని డొనాల్డ్ లూ వివరించారు. తాము విక్రయించిన విమానాలు కాలపరిమితి తీరే వరకు అత్యంత సురక్షితమైనవిగా ఉండేందుకు ఈ విధానం దోహదపడుతుందని తెలిపారు. 

పాకిస్థాన్ కు కూడా ఇదే వర్తిస్తుందని, అయితే, తాము ఎఫ్-16 విమానాల కోసం కొత్తగా అభివృద్ధి చేసిన ఆయుధాలను మాత్రం పాకిస్థాన్ కు అందించబోవడంలేదని లూ స్పష్టం చేశారు. 

భారత్ ప్రభుత్వం నుంచి అనేక ఆందోళనలను తాము వింటున్నామని, ఇది కేవలం ఇంతక్రితం విక్రయించిన విమానాల నిర్వహణ, విడిభాగాలకు సంబంధించిన విక్రయం మాత్రమేనని తేల్చి చెప్పారు. పాకిస్థాన్ కు కొత్తగా ఎలాంటి యుద్ధ విమానాలు ఇవ్వబోవడంలేదని, ఆయుధాలను కూడా ఇవ్వబోవడంలేదని వివరించారు. 

పాకిస్థాన్ కు గతంలో తాము విక్రయించిన ఎఫ్-16 యుద్ధ విమానాల్లో చాలావరకు 40 ఏళ్లకు పైబడినవని డొనాల్డ్ లూ తెలిపారు. ఇప్పటివరకు అవి ఎలాంటి ఆధునికీకరణకు నోచుకోలేదని అన్నారు. వాటిని అలాగే వదిలేస్తే పైలెట్లకు, ప్రజలకు ముప్పు ఉంటుందని పేర్కొన్నారు.
F-16
Fighter Jets
Spare Parts
USA
Pakistan
India

More Telugu News