Telangana: అడ్డంకులను అధిగమించడం తెలుసు... కలలను సాకారం చేసుకోవడమూ తెలుసు: కేటీఆర్
- తెలంగాణ పట్ల కేంద్రం వివక్షపై ప్రొఫెసర్ నాగేశ్వర్ ట్వీట్
- మాజీ ఎమ్మెల్సీ ట్వీట్‌పై స్పందించిన కేటీఆర్
- కేంద్రం ఏమీ ఇవ్వకున్నా తెలంగాణను అగ్రపథాన నడిపిస్తున్నట్టు వెల్లడి
- ఆయా రంగాల అభివృద్ధిని ప్రస్తావిస్తూ కేటీఆర్ వరుస ట్వీట్లు
తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ టీఆర్ఎస్ సర్కారు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణకు బల్క్ డ్రగ్ పార్క్‌ను కేటాయించని వైనంపై మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఓ ట్వీట్ పోస్ట్ చేయగా... దానిపై స్పందించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రం వివక్షపై వరుస ట్వీట్లు చేశారు.
కేంద్రం సహకారం అందించకున్నా... తెలంగాణను ఉన్నతంగా నిలిపే దిశగా టీఆర్ఎస్ సర్కారు చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. అంతేకాకుండా తెలంగాణ అభివృద్ధిలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించడం తమకు తెలుసునని, తమ కలలను సాకారం చేసుకునే సత్తా కూడా తమకు ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
కేంద్రం ఎన్ని కుట్రలు పన్నినా... తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌కు ఐటీఐఆర్ ప్రాజెక్టును కేంద్రం నిలిపేస్తే... రాష్ట్రంలో ఐటీ అభివృద్ధిని గడచిన 8 ఏళ్లలోనే 3.2 రెట్ల మేర వృద్ధి చేశామన్నారు. దేశంలో ఐటీ రంగంలో వస్తున్న ప్రతి 3 ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణలోనే ఉందని కూడా ఆయన అన్నారు. కేంద్రం సకాలంలో నిధులు ఇవ్వకున్నా... తాము మాత్రం దేశ జీడీపీలో 5 శాతం అందిస్తున్నామని తెలిపారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలను కేంద్రం నిరాకరిస్తున్నా 1.6 మిలియన్ల ఉద్యోగాలను ఇచ్చామన్నారు.
కేంద్రం బల్క్ డ్రగ్ పార్క్‌ను నిరాకరించినా, ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మా సిటీని ఏర్పాటు చేసుకున్నామని కేటీఆర్ తెలిపారు. మిషన్ భగీరథకు నిధులు ఇవ్వకున్నా... రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు మంచి నీటి సరఫరాను అందించి... దేశంలోనే తొలి రాష్ట్రంగా నిలిచామన్నారు. తెలంగాణకు కేంద్రం ఒక్క మెడికల్ కళాశాల ఇవ్వకున్నా... ప్రతి జిల్లాలో తాము మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. కేంద్రం ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వకున్నా... ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరాన్ని నిర్మించుకున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.