Ranbir Kapoor: మూవీ రివ్యూ: 'బ్రహ్మాస్త్రం'

Brahmastram movie review

  • ఈ శుక్రవారమే విడుదలైన 'బ్రహ్మాస్త్రం'
  • భారీ బడ్జెట్ .. భారీ తారాగణంతో రూపొందిన సినిమా
  • క్లారిటీలేని కథ .. అవసరానికి మించిన గ్రాఫిక్స్ 
  • ఆకట్టుకోని మాటలు .. మనసుకు పట్టుకోని పాటలు

రణబీర్ కపూర్ ..  అలియా భట్ జంటగా నటించిన 'బ్రహ్మాస్త్ర' సినిమాను కరణ్ జొహార్ - అపూర్వ మెహతా తదితరులు నిర్మించారు. అయాన్ ముఖర్జీ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ కథను రెండు భాగాలుగా విడగొట్టి, మొదటి భాగాన్ని ఈ రోజున పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశారు. అమితాబ్ .. షారుక్ .. నాగార్జున .. వంటి సీనియర్ స్టార్ హీరోలు నటించడం ఈ ప్రాజెక్టు ప్రతిష్ఠను మరింత పెంచింది. ప్రీతమ్ బాణీలను సమకూర్చిన ఈ సినిమాకి, సైమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా, తెలుగులో ఆ స్థాయి అంచనాలను ఎంతవరకూ అందుకుందన్నది చూద్దాం.

సకల అస్త్రాలకు అధిపతిగా చెప్పబడే బ్రహ్మస్త్రాన్ని చేజిక్కించుకోవడానికి కొన్ని చీకటి శక్తులు ప్రయత్నిస్తూ ఉంటాయి. అలాంటి దుష్ట శక్తుల చేతులకు ఆ అస్త్రం దక్కితే లోకాలకు చెడు జరుగుతుందని భావించిన మహర్షులు ఆ అస్త్రాన్ని మూడు భాగాలుగా చేసి .. మూడు ప్రదేశాల్లో దానిని నిక్షిప్తం చేస్తారు. ఒక భాగం 'బ్రహ్మాన్ష్' వర్గానికి  చెందిన ప్రముఖ శాస్త్రవేత్త మోహన్ భార్గవ్ (షారుక్) అధీనంలో ఉంటుంది. మరొక భాగం అనీష్ శెట్టి (నాగార్జున) అధీనంలో ఉంటుంది. మూడవ భాగం ఎక్కడ ఉందన్నది ఎవరికీ తెలియదు.

ఈ మూడు భాగాలను సేకరించి తనకి అందజేయమని ప్రతినాయకుడి స్థానంలో అజ్ఞాతంగా ఉన్న 'బ్రహ్మదేవ్' తన అనుచర వర్గానికి చెందిన జునూన్ (మౌనిరాయ్)కి అప్పగిస్తాడు. ఆ మూడు భాగాలు వారి చేతికి చిక్కకుండా 'బ్రహ్మాన్ష్' వర్గానికి చెందినవారు ప్రయత్నిస్తుంటారు. ఆ వర్గంలోని వాళ్లందరికీ గురూజీ (అమితాబ్) మార్గనిర్దేశం చేస్తుంటాడు. ఇదిలా ఉండగా శివ (రణబీర్ కపూర్) అనే యువకుడికి, జరగబోయే కొన్ని సంఘటనలు ముందుగానే తెలుస్తుంటాయి. అనాథగా పెరిగిన అతను, కొంతమంది అనాథ పిల్లలను చేరదీసి వాళ్ల పోషణ బాధ్యతను చూస్తుంటాడు. అలాంటి అతను గొప్పింటికి చెందిన ఇషా (అలియా భట్) ప్రేమలో పడతాడు. 

ఇషా తన జీవితంలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాతనే, తన చుట్టూ ఏదో జరుగుతోందనీ .. తనకి తెలియకుండానే తనలో ఏవో శక్తులు దాగున్నాయనే విషయం అతనికి అర్థమవుతుంది. దాంతో బ్రహ్మాస్త్రానికి రక్షకులుగా ఉన్నవారికి అండగా నిలిచి, విలన్ వర్గానికి అతను శత్రువుగా మారతాడు. ఫలితంగా అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? వాటిని అతను ఎలా ఎదుర్కున్నాడు? తనకి తెలియకుండానే  తనకి సంక్రమించిన శక్తులకు కారణం ఎవరు? ఇషాతో అతని ప్రేమ ప్రయాణం సుఖంతమవుతుందా? అనే మలుపులతో ఈ కథ నడుస్తుంది.

తెలుగు వెర్షన్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో ఇంట్రస్టింగ్ గా మొదలవుతుంది. ఇది సాధారణమైన కథ కాదనే విషయం వాయిస్ ఓవర్ ద్వారానే మనకి తెలిసిపోతుంది. ఫస్టు సీన్ నుంచే సినిమా గ్రాండ్ గా మొదలవుతుంది. అక్కడి నుంచే గ్రాఫిక్స్ గారడీ స్టార్ట్ అవుతుంది. హీరో .. హీరోయిన్ లతో పాటు ముందుగా షారుక్ .. ఆ తరువాత నాగార్జున .. ఆ వెంటనే అమితాబ్ కథలోకి ఎంటరవుతారు. కథ ఒక చోటు నుంచి మరొక చోటుకి .. బలమైన పాత్రలను టచ్ చేస్తూ పరుగులు తీస్తూ ఉంటుంది. కానీ కథ ఎక్కడా కూడా మరింత చిక్కబడుతున్నట్టుగా అనిపించదు. 

హీరో  .. హీరోయిన్ల పరిచయం దగ్గర నుంచి మొదలుపెడితే, ప్రతి సన్నివేశం గ్రాండియర్ గా కనిపిస్తుందిగానీ .. సహజత్వం ఎంతమాత్రం కనిపించదు. కథను ఎప్పటికప్పుడు గ్రాఫిక్స్ డామినేట్ చేస్తూ వచ్చాయి. ఇక్కడ గ్రాఫిక్స్ అవసరం .. అక్కడ అవసరం లేదు అనే మాటే లేదు. ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారం వాడేశారు. దాంతో తెరపై సినిమా కాకుండా ఏదో మాయాజాలం చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏ పాత్ర బలమైనది అనే విషయంలో చివరివరకూ ఒక క్లారిటీ అనేది రాదు. ఆ మాటకి వస్తే 'బ్రహ్మాస్త్రం' శక్తి కూడా హీరోలోని అగ్ని తీవ్రతకు అదుపులోకి వచ్చినట్టుగా చెప్పారు .. చూపించారు.

ఇక ఇప్పటివరకూ పౌరాణిక సినిమాలు చూసి 'బ్రహ్మాస్త్రం' అంటే శక్తిమంతమైన బాణంలా ఉంటుందని అనుకుంటూ వచ్చినవారికి, 'బ్రహ్మాస్త్రం' ప్లేట్ మాదిరిగా గుండ్రంగా చూపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక ఆ బ్రహ్మాస్త్రం మూడు ముక్కలుగా చూపించడం ఒక చిత్రమైతే, దాని భాగాలు ఎలాంటి శక్తి లేకుండా ఎక్కడ పడితే అక్కడ కింద పడిపోతూ ఉంటాయి. ఒకరి చేతిలో నుంచి ఒకరి చేతులు మారే క్రమంలో దానిని ఒక సాధారణమైన వస్తువుగా చూపించడం ప్రేక్షకుడికి ఇబ్బందిని కలిగిస్తుంది.       

ఇక 'బ్రహ్మదేవ్' అనే పేరుతో అసలైన ప్రతినాయకుడు ఉన్నాడని చెబుతూనే, అన్ని పనులను మౌని రాయ్ తో నడిపించారు. ఈ తరహా పాత్రలకు ఆమె ఫేమస్ కనుక మొదటి నుంచి చివరివరకూ ఆమెనే విలన్ గా కనిపిస్తుంది. చివరికి వచ్చేసరికి బ్రహ్మస్త్రం కంటే ప్రేమ అనే అస్త్రం గొప్పదనే సందేశం ఇచ్చారు. హీరో .. అతని చుట్టూ ఉన్న మిగతా ముఖ్యమైన పాత్రలు నిరూపించవలసిన విషయం అది కానే కాదు. లోక హితం కోసం మొదలైన ప్రయత్నం చివరికి వచ్చేసరికి హీరో ప్రేమఖాతాలోకి తోసేసినట్టు అయింది. 

సంగీతం విషయానికి వస్తే ట్యూన్స్ గొప్పగా లేవు. డబ్బింగ్ సినిమాల్లోని పాటలు ఇలాగే ఉంటాయంతే అన్నట్టుగానే ఉన్నాయి. పాటలన్నీ తెలుగులోనే ఉన్నాయిగానీ .. పొంతనలేని వాక్యాలతో నడుస్తాయి. వాటిని ఒక దగ్గర పేర్చుకుని .. కూర్చుకుని అర్థం  చేసుకోవలసిందే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది .. ఫొటోగ్రఫీకి వంక బెట్టనవసరం లేదు. ఇక నటీనటులంతా నటనలో పండిపోయినవారే గనుక, ఎవరి పాత్రకి వారు న్యాయం చేశారు. అర్థవంతమైన కథ .. ఆసక్తికరమైన కథనం .. ఈ రెండింటికీ తోడు క్లారిటీ లేకుండా నడిచిన సినిమా ఇది. అరుదైన కాంబినేషన్ ..  అద్భుతమైన గ్రాఫిక్స్ ఈ సినిమాను ఎంతవరకూ నిలబెడతాయనేది చూడాలి మరి. 

--- పెద్దింటి గోపీకృష్ణ

  • Loading...

More Telugu News