slice of cake: వెడ్డింగ్ కేక్ లో ఒక ముక్క కోసం రూ.2 లక్షలు
- చార్లెస్, డయాన వివాహానికి కానుకగా వచ్చిన కేక్
- ఇందులో ఒక దానికి గతేడాది వేలం
- భారీ ధరకు సొంతం చేసుకున్న రాజకుటుంబం అభిమాని
బ్రిటన్ మాజీ యువరాణి డయానా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రస్తుత బ్రిటన్ రాజు చార్లెస్ ను డయానా స్పెన్సర్ 1981 జులై 29న వివాహం చేసుకున్నారు. నాడు వారి వివాహ వేడుక సందర్భంగా ఎన్నో కంపెనీలు కేక్ లను పంపించాయి. అలా సుమారు 20 కేక్ లు చార్లెస్, డయానా వివాహం సందర్భంగా వచ్చాయి. నాటి ఓ కేక్ లోని పీస్ కోసం గతేడాది వేలం నిర్వహించగా భారీ ధరకు అమ్ముడుపోయింది.
చార్లెస్, డయానా మధ్య బంధం విభేదాల కారణంగా 1992లో తెగిపోగా.. 1996లో ఆ జంట విడాకులు తీసుకోవడం గమనార్హం. ఆ మరుసటి ఏడాదే 1997లో కారు ప్రమాదంలో డయానా మరణించారు. రాజ కుటుంబానికి చెందిన ఓ అభిమాని చార్లెస్, డయానా వివాహ కేక్ పీస్ ను 1,850 పౌండ్లు (2,565 డాలర్లు) చెల్లించి సొంతం చేసుకున్నారు. మన కరెన్సీలో అయితే సుమారు రూ.2 లక్షలు.
40 ఏళ్ల తర్వాత గతేడాది ఈ కేక్ కోసం వేలం జరిగింది. తొలుత ఈ కేక్ ను రాజకుటుంబం ఉద్యోగి మోయా స్మిత్ కు ఇవ్వగా.. ఆమె దీన్ని జాగ్రత్తగా భద్రపరిచింది. డొమినిక్ వింటర్ ఆక్షనీర్స్ ఈ వేలం నిర్వహించింది. దీన్ని జెర్నీ లేటన్ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. ఒక కేక్ ఇంత కాలం పాటు పాడైపోకుండా ఎలా ఉంటుంది? అన్న సందేహం సహజంగానే వస్తుంది. దీన్ని పాడైపోకుండా జాగ్రత్తగా భద్రపరిచారట.