KCR: జాతీయ పార్టీ కోసం మూడు పేర్లను పరిశీలిస్తున్న కేసీఆర్!
- జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్న కేసీఆర్
- జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం అవసరమంటున్న టీఎస్ సీఎం
- కేసీఆర్ ను కలిసేందుకు రేపు హైదరాబాద్ కు వస్తున్న కుమారస్వామి
ఉద్యమ నేతగా, తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాష్ట్ర ప్రజల్లో ఎంతో ఆదరణ ఉంది. కొంతకాలంగా ఆయన కేంద్రంలోని బీజేపీ వ్యవహారశైలిపై, పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీజేపీ పాలనలో దేశం నాశనమైపోయిందని ఆయన మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం అవసరమని చాలా కాలంగా చెపుతున్న కేసీఆర్ చివరకు జాతీయ పార్టీని స్థాపించడానికి సిద్ధమయ్యారు. జాతీయ పార్టీకి సంబంధించి అధికార ప్రకటనకు కౌంట్ డౌన్ కూడా ప్రారంభమయింది.
మరోవైపు, జాతీయ పార్టీకి మూడు పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. భారత రాష్ట్ర సమితి, భారత నిర్మాణ సమితి, భారత ప్రజా సమితి పేర్లను ఆయన పరిశీలిస్తున్నారు. వీటిలో ఒక పేరును ఆయన ఖరారు చేయనున్నారు. జాతీయ రాజకీయాల్లో భాగంగా ఇటీవలే బీహార్ కు వెళ్లి సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ లను ఆయన కలిసిన సంగతి తెలిసిందే. మరోవైపు, కేసీఆర్ ను కలిసేందుకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి రేపు హైదరాబాద్ కు వస్తున్నారు.