Nandyal District: స్కూల్ ను ఆక్రమించి ఇంటిగా మార్చుకున్న వైసీపీ నేత
- నంద్యాల జిల్లా పాణ్యంలో అధికార పార్టీ నేత ఆగడం
- ఖాళీగా ఉన్న స్కూల్ ను ఆక్రమించి, నివాసానికి అనుకూలంగా మార్చుకున్న వైనం
- ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన స్థానికులు
ఏపీలో కొందరు వైసీపీ నేతలు చేస్తున్న పనుల వల్ల అధికార పార్టీకి చెడ్డపేరు వస్తోంది. ముఖ్యమంత్రి జగన్ పదేపదే హెచ్చరిస్తున్నప్పటికీ కొందరు తీరు మార్చుకోవడం లేదు. తాజాగా నంద్యాల జిల్లా పాణ్యంలో ఓ వైసీపీ నేత బరితెగించిన విధానం అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే, పాణ్యంలోని ఇందిరా నగర్ లో చెంచు గిరిజన విద్యార్థుల కోసం ప్రభుత్వం 2013లో రూ. 5.30 లక్షలతో పాఠశాలను నిర్మించింది. అయితే ఆ స్కూల్లో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉందనే కారణంతో దాన్ని మూసేశారు. ఆ పాఠశాలలో ఉన్న విద్యార్థులను వేరే స్కూల్ కు తరలించారు.
ఈ క్రమంలో, ఆ స్కూల్ ను స్థానిక వైసీపీ నేత ఒకరు ఆక్రమించుకున్నారు. అంతేకాక, తాను అందులో నివసించేందుకు వీలుగా బిల్డింగ్ లో మార్పులు కూడా చేయించుకున్నారు. దీనిపై స్థానికులు కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సదరు నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.