Bhuvneshwar Kumar: ఆసియా కప్ లో విశేషంగా రాణించిన భువీ... అతడిపై అతిగా ఆశలు పెట్టుకోవద్దంటున్న పాక్ మాజీ కెప్టెన్

Pakistan former skipper Salman Bhatt analyses Bhuvneswar Kumar bowling

  • ఆసియా కప్ లో 11 వికెట్లు సాధించిన భువనేశ్వర్ 
  • ఆఫ్ఘన్ పై 4 పరుగులిచ్చి 5 వికెట్లు తీసిన వైనం
  • భువీ బౌలింగ్ లో పేస్ లేదన్న సల్మాన్ భట్
  • చివరి ఓవర్లలో ఈజీగా కొట్టేస్తారని వెల్లడి
  • భువీ స్వింగ్ ను పెద్ద జట్లు లెక్కచేయవని వివరణ

టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ కు ఆసియా కప్ టోర్నీ చిరస్మరణీయం అని చెప్పాలి. ఈ టోర్నీలో భువీ 11 వికెట్లు సాధించడం విశేషం. ముఖ్యంగా, ఆఫ్ఘనిస్థాన్ తో పోరులో కేవలం 4 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. కొత్త బంతితో తానెంత ప్రమాదకరమో మరోసారి నిరూపించాడు. 

అయితే, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ మాత్రం భువీ ప్రదర్శనపై పెదవి విరుస్తున్నాడు. టీమిండియా అతడిపై మరీ ఆశలు పెంచుకోవద్దని సూచిస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్ లో అతడు ఉపయోగకరమైన బౌలర్ అవుతాడని టీమిండియా భావిస్తే, అది పొరపాటే అవుతుందని అన్నాడు. అందుకు గల కారణాలను కూడా సల్మాన్ భట్ వివరించాడు. 

భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో వేగం తక్కువ అని, దాంతో చివరి ఓవర్లలో అతడి బంతుల్లో పస ఉండదని, ప్రత్యర్థులు భారీగా పరుగులు సాధిస్తారని తెలిపాడు. ప్రారంభ ఓవర్లలో కొత్త బంతితో భువనేశ్వర్ స్వింగ్ రాబట్టినప్పటికీ, పెద్ద జట్లపై ఆ స్వింగ్ ఏమంత ప్రభావం చూపించదని అభిప్రాయపడ్డాడు. 

ఆఫ్ఘన్ బ్యాట్స్ మెన్ చాలామంది హార్డ్ హిట్టర్లని, వారు లైన్ మిస్సవడం వల్ల భువీకి వికెట్లు అప్పగించారని సల్మాన్ భట్ విశ్లేషించాడు. ఆఫ్ఘన్ బ్యాట్స్ మెన్ కు పెద్దగా టెక్నిక్ ఉండదని, అందుకే స్వింగ్ బౌలింగ్ ను ఎదుర్కోలేకపోయారని సూత్రీకరించాడు. అగ్రశ్రేణి జట్లు అయితే ఆ మాత్రం స్వింగ్ ను అసలు లెక్కలోకే తీసుకోవని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News