Andhra Pradesh: కాంట్రిబ్యూటరీ పెన్షన్ పై రెండు నెలల్లో నిర్ణయం: బొత్స సత్యనారాయణ
- సీపీఎస్ రద్దు అనేది ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒకటని వివరణ
- దీనిపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆమోదయోగ్యంగా ఉంటుందని వెల్లడి
- ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని ఈ ఏడాది ఆఖరుకల్లా పరిష్కరిస్తామని వివరణ
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)పై రెండు నెలల్లో నిర్ణయం తీసుకుంటామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఎన్నికల ముందు వైఎస్సార్ సీపీ ఇచ్చిన హామీల్లో సీపీఎస్ రద్దు అనేది కూడా ఒకటని.. ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బొత్స తెలిపారు. ఇదే క్రమంలో సీపీఎస్ అంశంపైనా తగిన నిర్ణయం తీసుకుంటామని.. ఇది ఉద్యోగులకు ఆమోదయోగ్యంగా ఉంటుందని వెల్లడించారు. ఈ అంశాన్ని రెండు నెలల్లో తేల్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని ఈ ఏడాది చివరి నాటికి పరిష్కరిస్తామని వివరించారు.
ఉద్యోగ సంఘాలతో భేటీలో..
తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఇటీవల ఏపీ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. ఇటీవల ఉద్యోగ సంఘాల నాయకులతో భేటీ అయిన బొత్స సత్యానారాయణ.. సీపీఎస్ రద్దుపై తాము తొందరపడి హామీ ఇచ్చామని పేర్కొనడం గమనార్హం.