Sharad Pawar: ఎన్సీపీ అధినేతగా శరద్ పవార్ మరోసారి ఎన్నిక
- రాజకీయ వ్యూహచతురుడిగా పవార్ కు గుర్తింపు
- ఎన్సీపీపై పూర్తి పట్టు
- మరో నాలుగేళ్లు అధ్యక్షుడిగా పవార్
- పార్టీ జాతీయ కార్యనిర్వాహక సమావేశంలో తీర్మానం
భారత్ లోని రాజకీయ దురంధురుల్లో శరద్ పవార్ ఒకరు. 2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీని అధికారం పీఠం ఎక్కకుండా చేసి, కాంగ్రెస్, శివసేనలను ఒక్కచోటికి చేర్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం శరద్ పవార్ కే చెల్లింది. ఆయన నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాడు సంకీర్ణ ప్రభుత్వంలో కీలకంగా నిలిచింది.
కాగా, ఎన్సీపీ అధినేతగా శరద్ పవార్ మరోసారి ఎన్నికయ్యారు. 81 ఏళ్ల శరద్ పవార్ మరో నాలుగేళ్ల పాటు ఎన్సీపీ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఢిల్లీలో జరిగిన పార్టీ జాతీయ కార్యనిర్వాహక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జాతీయ రాజకీయాల్లోనూ పవార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. థర్డ్ ఫ్రంట్ దిశగా చర్చలకు ఆయనే కేంద్రబిందువుగా ఉన్నారు. ఆయనను తాజాగా బీహార్ సీఎం నితీశ్ కుమార్ కలిసి ఎన్డీయే వ్యతిరేక ఫ్రంట్ పై చర్చలు జరిపారు.