Krishnam raju: కృష్ణంరాజు ఓ స్టార్ గా వెలిగిపోవడానికి.. ఎల్వీ ప్రసాద్ ఇచ్చిన సూచనే కారణం
- తొలి సినిమా 'చిలకా గోరింక' పరాజయంతో నిరాశపడిన రెబెల్ స్టార్
- తదుపరి 'నేనంటే నేనే' సినిమా చేయడానికి వెనుకంజ
- ఎల్వీ ప్రసాద్ సూచనతో అంగీకరించిన కృష్ణంరాజు
కృష్ణంరాజు అంత గొప్ప స్టార్ గా వెలిగిపోవడానికి, పరిశ్రమలో సుస్థిర స్థానం సంపాదించుకోవడానికి వెనుక ప్రముఖ నిర్మాత ఎల్వీ ప్రసాద్ చేసిన సూచన గురించి తెలుసుకోవాలి. నిజానికి తన తొలి చిత్రం 'చిలకా గోరింక' సినిమా తర్వాత సినీ పరిశ్రమ నుంచి కృష్ణంరాజు వెళ్లిపోవాలని అనుకున్నారు. ఎందుకంటే ఆ సినిమా అనుకున్న మేర సక్సెస్ ఇవ్వలేదు. ఈ బాధతోనే ఆయన తనకు సినిమాలు అచ్చి రావేమో అనుకున్నారు.
అదే సమయంలో ‘నేనంటే నేనే’ సినిమాలో అవకాశం రాగా, పాత్ర నచ్చక అంగీకరించలేదు. సరిగ్గా అప్పుడే నిర్మాత ఎల్వీ ప్రసాద్ ను కలుసుకోవాల్సి వచ్చింది. ‘‘నీవు చేసిన పాత్ర ఎలాంటిది అన్నది కాదు. ఆ పాత్ర ద్వారా ప్రజలకు చేరువ అయ్యావా? ఇచ్చిన పాత్రకు న్యాయం చేశావా? అన్నదే నటుడిగా నీవు చూడాల్సింది’’అని ఎల్వీ ప్రసాద్ చెప్పారట. ఈ విషయాన్ని ఓ సందర్భంలో కృష్ణంరాజు స్వయంగా వెల్లడించారు.
ఎల్వీ ప్రసాద్ చెప్పిన మాటలు ధైర్యాన్ని ఇవ్వడంతో కృష్ణంరాజు 'నేనంటే నేనే' సినిమా చేశారు. అది విజయవంతం కావడంతో ఆయనలో నమ్మకం పెరిగింది. అప్పుడు భిన్నమైన పాత్రలతో అవకాశాలు తలుపుతట్టాయి. దీంతో అసలు తాను పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ఎల్వీ ప్రసాదే కారణమని కృష్ణంరాజు గతంలో చెప్పారు.