Krishnam raju: రాజకీయాల్లోనూ సత్తా చాటిన కృష్ణంరాజు.. విలువల పతనంపై నిర్వేదం

Krishnam raju political career success as a minister

  • డబ్బు ఇస్తే కానీ ఓటు వేయని పరిస్థితులపై విచారం వ్యక్తీకరణ
  • వాజ్ పేయి ప్రభుత్వంలో పలు శాఖలకు సహాయ మంత్రిగా సేవలు
  • 1998, 1999లో కాకినాడ, నర్సాపురం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం

కృష్ణంరాజు ఓ గొప్ప నటుడిగానే ఎక్కువ మందికి తెలుసు. ఆయనలో ఓ రాజకీయ నాయకుడిని దర్శించినవారు తక్కువే. కానీ బీజేపీ నాయకుడిగా, కేంద్ర మంత్రిగానూ ఆయన సేవలు అందించారు. రాజకీయాల్లో వచ్చిన మార్పులపై ఓ సందర్భంలో కృష్ణంరాజు విచారం కూడా వ్యక్తం చేయడం గమనార్హం.

కేంద్ర మంత్రిగా తాను పనిచేసిన సమయంలో ప్రతి విభాగంలోనూ మార్పు దిశగా చర్యలు తీసుకున్నట్టు కృష్ణంరాజు వెల్లడించారు. ఎంపీగా తన నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు తలపెట్టినట్టు తెలిపారు. 400 గ్రామాలలో తన ముద్ర కనిపిస్తుందన్నారు. కానీ, దురదృష్టవశాత్తూ డబ్బు ఇస్తే కానీ ఓటు వేయని పరిస్థితుల వచ్చాయని కృష్ణంరాజు బాధను వ్యక్తం చేశారు. 

ప్రభుత్వాలు ప్రజలను సోమరిపోతులుగా మార్చకుండా, వారి ఉపాధికి అనుకూలించే చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు, ఇతర అవసరమైన వర్గాలకే రాయితీలు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. దేశంలో కేంద్ర మంత్రి అయిన తొలి హీరో తానేనని ప్రకటించారు. 

కృష్ణంరాజు 1992లో తొలిసారి కాంగ్రెస్ పార్టీ టికెట్ పై నర్సాపురం పార్లమెంటరీ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన ఆయన 1998 లోక్ సభ ఎన్నికల్లో కాకినాడ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 1,65,000 ఓట్ల మెజారిటీతో ఆయన రికార్డు విజయం నమోదు చేశారు. 1999లో మరోసారి లోక్ సభకు నర్సాపురం స్థానం నుంచి ఎన్నికయ్యారు. 

2000 సెప్టెంబర్ 30 నుంచి విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా, 2001  జులై 22 నుంచి రక్షణ శాఖ సహాయ మంత్రిగా, 2002  జులై 1 నుంచి వినియోగ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా వాజ్ పేయి ప్రభుత్వ హయంలో కృష్ణంరాజు సేవలు అందించారు.

  • Loading...

More Telugu News