Bhanuka Rajapaksa: రాజపక్స డైనమిక్ ఇన్నింగ్స్... పాకిస్థాన్ టార్గెట్ 171 రన్స్

Rajapaksa fifty leads Sri Lanka reasonable total against Pakistan in Asia Cup Final

  • దుబాయ్ లో ఆసియా కప్ ఫైనల్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాక్
  • మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు
  • 71 పరుగులతో అజేయంగా నిలిచిన రాజపక్స
  • దాటిగా ఆడిన హసరంగ

పాకిస్థాన్ తో ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు చేసింది. భానుక రాజపక్స 71 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 

ఓ దశలో 58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన శ్రీలంకను భానుక రాజపక్స, వనింద హసరంగ జోడీ ఆదుకుంది. రాజపక్స అద్భుతంగా బ్యాటింగ్ చేసి 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇన్నింగ్స్ చివరి రెండు బంతులను రాజపక్స ఫోర్, సిక్స్ కొట్టడం విశేషం. హసరంగ 21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 36 పరుగులు చేశాడు. 

ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన శ్రీలంక మొదట బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లు పత్తుమ్ నిస్సాంక (8), కుశాల్ మెండిస్ (0) దారుణంగా విఫలమయ్యారు. పాక్ పేసర్లు రెచ్చిపోవడంతో శ్రీలంక వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రాజపక్స, హసరంగ జోడీ ఎంతో తెగువతో బ్యాటింగ్ చేయడం హైలైట్ గా నిలిచింది. 

ముఖ్యంగా, హసరంగ ఎదురుదాడికి ప్రాధాన్యత ఇచ్చాడు. అదే ఊపులో రవూఫ్ బౌలింగ్ లో భారీ షాట్ కొట్టబోయి వికెట్ కీపర్ రిజ్వాన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. హసరంగ అవుటైనా రాజపక్స దూకుడు తగ్గించలేదు. భారీ షాట్లు కొడుతూ లంక స్కోరుబోర్డును పరుగులు తీయించాడు. ఆఖర్లో చామిక కరుణ రత్నే (14 నాటౌట్) నుంచి అతడికి మెరుగైన సహకారం లభించింది. 

కెప్టెన్ దసున్ షనక 2 పరుగులకే అవుట్ కాగా, దనుష్క గుణతిలక 1 పరుగు చేసి నిరాశపరిచాడు. పాక్ బౌలర్లలో హరీస్ రవూఫ్ 3 వికెట్లు తీయగా, నసీమ్ షా 1, షాదాబ్ ఖాన్ 1, ఇఫ్తికార్ అహ్మద్ 1 వికెట్ తీశాడు.

  • Loading...

More Telugu News