Bollywood: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన మూసేవాలా హత్యకేసు నిందితులు
- సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీంఖాన్ లక్ష్యంగా రెక్కీ
- అంగీకరించిన నిందితుడు కపిల్ పండిట్
- గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సూచనల మేరకే రెక్కీ
- మూసేవాలా హత్యకేసులో ఇప్పటి వరకు 23 మంది అరెస్ట్
పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలాను చంపినట్టుగానే బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీంఖాన్‌ను హతమారుస్తామంటూ హెచ్చరించిన నిందితులు సల్మాన్ ఇంటి వద్ద రెక్కీ కూడా నిర్వహించారు. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సూచనలతోనే వీరు ఈ రెక్కీ నిర్వహించినట్టు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ నిన్న తెలిపారు. మూసేవాలా హత్య కేసులో అరెస్టయిన కపిల్ పండిట్‌ను విచారించగా ఈ రెక్కీ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు.
లారెన్స్ బిష్ణోయ్ సూచనల మేరకు సల్మాన్ ఖాన్ లక్ష్యంగా మరో ఇద్దరితో కలిసి రెక్కీ నిర్వహించినట్టు కపిల్ అంగీకరించినట్టు డీజీపీ తెలిపారు. ఆ ఇద్దరిని కూడా విచారిస్తామని పేర్కొన్నారు. సిద్ధూ మూసేవాలా హత్యకేసులో 35 మంది నిందితుల ప్రమేయం ఉందని గుర్తించిన పోలీసులు ఇప్పటి వరకు 23 మందిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. మూసేవాలాపై కాల్పులకు పాల్పడిన ఆరుగురు ప్రధాన నిందితుల్లో చివరి వ్యక్తిని శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.