Komatireddy Raj Gopal Reddy: ఓయూ హాస్టల్ భోజనంలో గాజు పెంకులు: వీడియో షేర్ చేసి, మంత్రిపై విమర్శలు గుప్పించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
- విద్యార్థులకు వడ్డించిన చికెన్ కర్రీలో గాజు పెంకులు
- మీ సీఎం మనవడు తినే భోజనమే వీరికీ పెడుతున్నారా? అని ప్రశ్న
- ఇవి కూడా సిల్లీ రీజన్సే అవుతాయా? అని నిలదీత
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో విద్యార్థులకు వడ్డించిన చికెన్ కర్రీలో గాజు పెంకులు వచ్చిన ఘటనపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆందోళనకు దిగిన విద్యార్థినుల వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఆయన.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి పలు ప్రశ్నలు కురిపించారు. అన్నం గడ్డలుగా ఉందని, గాజు పెంకులు వచ్చాయని పేర్కొన్న ఆయన.. వీటికి ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇవి కూడా సిల్లీ రీజన్సే అవుతాయా? అని ప్రశ్నించారు. మీ ముఖ్యమంత్రి మనవడు తినే భోజనమే వీరికీ పెడుతున్నారా? అని నిలదీశారు.
ఈ ట్వీట్‌ను మంత్రి సబిత, తెలంగాణ సీఎంవోను ట్యాగ్ చేశారు. మరోవైపు, కర్రీలో గాజు పెంకులు వచ్చిన ఘటనపై విద్యార్థినులు మాట్లాడుతూ.. గాజు పెంకులు కనిపించే సరికే చాలా వరకు అన్నం తిన్నామని, తమలో ఎవరికైనా ఏమైనా జరిగితే ప్రభుత్వ పెద్దలే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అబ్బాయిల కంటే అమ్మాయిలే బలంగా ఉండాలని స్పీచ్‌లు ఇవ్వడం కాదని, వారికి ఏం పెడుతున్నామో? ఎలాంటి ఆహారం పెడుతున్నామో కూడా చూడాలని అన్నారు.