Hyderabad: డెల్టా వేరియంట్ యమా డేంజర్ గురూ.. సీసీఎంబీ అధ్యయనం చెబుతున్నది ఇదే!

Delta Variant is more Dangerous than other variants says ccmb
  • ఆల్పా, డెల్టాతో పాటు మరో మూడు వేరియంట్లపై అధ్యయనం
  • డెల్టా వేరియంట్‌కు స్పందించని యాంటీబాడీలు
  • అది సోకితే రోగ నిరోధక వ్యవస్థకు అందని హెచ్చరికలు
  • ప్రపంచంలోని అన్ని వేరియంట్ల కంటే ఇదే అత్యంత ప్రమాదకారంటున్న సీసీఎంబీ
భారత్‌లో సెకండ్ వేవ్‌కు కారణమైన కరోనాలోని డెల్టా వేరియంట్ ఎంతోమంది ప్రాణాలను పొట్టనపెట్టుకుంది. తాజాగా, ఈ వేరియంట్‌కు సంబంధించి హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) నిర్వహించిన అధ్యయనంలో మరో ఆందోళనకర అంశం వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్‌లోని అన్ని వేరియంట్ల కంటే డెల్టా అత్యంత ప్రమాదకరమైనదని ఈ అధ్యయనంలో గుర్తించారు. 

సార్క్- కోవ్- 2 వైరస్ సోకిన వ్యక్తులు ఒక్కో వేరియంట్‌కు ఒక్కోలా స్పందిస్తారా? లేదా? అన్న విషయాన్ని తెలుసుకునేందుకు సీసీఎంబీ ఈ అధ్యయనం చేసింది. ఇందులో భాగంగా కరోనా రకాలైన ఆల్ఫా, డెల్టాతోపాటు అంతకుముందు వెలుగుచూసిన మూడు వేరియంట్లపై పరిశోధన నిర్వహించారు. అయితే, ఇతర వేరియంట్లతో పోలిస్తే డెల్టా వేరియంట్ సోకినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ సమర్థమైన యాంటీబాడీలను ఉత్పత్తి చేయని విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. మిగతా నాలుగు వేరియంట్ల విషయంలో రోగ నిరోధక వ్యవస్థకు హెచ్చరికలు అందినప్పటికీ డెల్టా విషయంలో అలా జరగలేదని గుర్తించారు. 

డెల్టా విషయంలో యాంటీబాడీలు శక్తిమంతం కావని తెలుసుకున్నారు. దీంతో శాస్త్రవేత్తలు ఈ వేరియంట్ విషయంలో ఓ నిర్ధారణకు వచ్చారు. ఈ సందర్భంగా అధ్యయనకారులు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వేరియంట్లు వ్యాపిస్తున్నాయని, కానీ వాటి ప్రభావంలో చాలా తేడాలు ఉన్నట్టు గుర్తించామన్నారు. అన్నింటికంటే కూడా డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకారన్న విషయాన్ని గుర్తించినట్టు వారు వివరించారు.
Hyderabad
CCMB
Delta Variant
Corona Virus

More Telugu News