Danish Kaneria: సంజూ శాంసన్‌కు అన్యాయం జరిగింది: పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా

Sanju Samson should have been considered for Indias T20 World Cup squad says Danish Kaneria

  • సంజూ శాంసన్‌ను తరచూ విస్మరిస్తున్నారన్న కనేరియా
  • పంత్‌కు బదులుగా అతడిని తీసుకుని ఉండాల్సిందన్న పాక్ మాజీ క్రికెటర్
  • రోహిత్, కేఎల్ రాహుల్ పరుగులు చేయకుంటే అలంటి ఫలితమే వస్తుందని హెచ్చరిక

కేరళకు చెందిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్‌కు అన్యాయం జరిగిందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా అభిప్రాయపడ్డాడు. ఐసీసీ టీ20 కప్‌‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన అనంతరం డానిష్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్లు రిషభ్‌పంత్‌, దినేశ్ కార్తీ‌క్‌లకు చోటుదక్కింది. ఇటీవల జరిగిన ఆసియా కప్‌లో తలపడిన భారత జట్టులోనూ సంజు శాంసన్‌కు చోటు లభించలేదు. టీ20 ప్రపంచకప్ జట్టులో సంజూని తీసుకుని ఉంటే బాగుండేదని కనేరియా పేర్కొన్నాడు.

జట్టులో చోటు దక్కకపోవడానికి అతడు చేసిన తప్పేంటని ప్రశ్నించాడు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో జరిగిన హోం సిరీస్‌లలోనూ అతడిని విస్మరించారని విమర్శించాడు. ప్రపంచకప్‌కు ప్రకటించిన జట్టులో పంత్‌కు బదులుగా సంజూను తీసుకుంటే బాగుండేదని, తన మద్దతు అతడికేనని కనేరియా స్పష్టం చేశాడు. అలాగే, స్టాండ్‌బై ఆటగాడిగా ఉమ్రాన్ మాలిక్‌‌ను కూడా తీసుకుని ఉండాల్సిందన్నాడు. నిలకడ వేగంతో బంతులు సంధించగల బౌలర్‌పై భారత బ్యాటర్లు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఉమ్రాన్ మాలిక్ ‌ను స్టాండ్‌బైగా తీసుకుని ఉంటే బాగుండేదన్నాడు.

విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడన్న కనేరియా.. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వంటివారు భారీ స్కోర్లు చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పాడు. లేదంటే ఆసియా కప్‌లానే టీ20 ప్రపంచకప్‌లోనూ భారత ప్రస్థానం ముగిసిపోతుందని హెచ్చరించాడు.

ప్రపంచకప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్.అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్ 

స్టాండ్‌బై ఆటగాళ్లు: మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్

  • Loading...

More Telugu News