VRA: తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి వీఆర్ఏలు, ఉపాధ్యాయ సంఘాల ప్రయత్నం.. పరిస్థితి ఉద్రిక్తం
- ఇందిరా పార్క్ నుంచి అసెంబ్లీ వైపు వెళ్తున్న వారిని అరెస్ట్ చేస్తున్న పోలీసులు
- మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ నేతల ఆందోళన
- అసెంబ్లీ పరిసరాల ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు
తమ సమస్యలను పరిష్కరించాలంటూ వీఆర్ ఏలు, ఉపాధ్యాయ సంఘాలు సహా ఏడు సంఘాలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడంతో హైదరాబాద్ లో ఇందిరా పార్కు, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అసెంబ్లీ ముట్టడికి వచ్చిన వందలాది మంది వీఆర్ ఏ లను అడ్డుకుంటున్న పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు.
మరోపక్క, వీరికి తోడు ఉపాధ్యాయ సంఘాలు, కాంగ్రెస్ అనుబంధ మత్స్యకార సంఘం కూడా ఆందోళన చేపట్టడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేస్తూ వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అసెంబ్లీ పరిసర ప్రాంతంలో ఉన్న రోడ్డు మొత్తాన్ని పోలీసులు బ్లాక్ చేశారు. అటుగా వెళ్తున్న వాహనాలను దారి మళ్లిస్తున్నారు.
పే స్కేల్ ప్రకారం తమకు జీతాలు ఇస్తామని గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి మాట తప్పారని వీఆర్ ఏలు ఆరోపిస్తున్నారు. తమను ఇతర శాఖల్లో చేరుస్తామని నిన్న అసెంబ్లీలో సీఎం చేసిన ప్రకటనపై వారు మండిపడుతున్నారు. తమను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆందోళన బాట పట్టాయి. ఇక, మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్ కూడా చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. మరికొన్ని సంఘాలు కూడా సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ లో అందోళన చేస్తున్నాయి.