Telangana: సమస్యలు పరిష్కరిస్తాం... ఆందోళన విరమించండి: వీఆర్ఏలకు కేటీఆర్ పిలుపు
- సమస్యల పరిష్కారం కోసం వీఆర్ఏల ఆందోళన
- మంగళవారం అసెంబ్లీ ముట్టడికి యత్నించిన వీఆర్ఏలు
- వీఆర్ఏలతో చర్చలు జరిపిన మంత్రి కేటీఆర్
- ఈ నెల 20న మరోమారు చర్చిద్దామని ప్రతిపాదన
గత కొన్ని రోజులుగా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్న వీఆర్ఏలతో తెలంగాణ మంత్రి కేటీఆర్ మంగళవారం చర్చలు జరిపారు. సమస్యల పరిష్కారం కోసం ఓ వైపు నిరవధిక నిరాహార దీక్షలు కొనసాగిస్తున్న వీఆర్ఏలు మంగళవారం అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ముట్టడికి వచ్చిన వీఆర్ఏలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వీఆర్ఏలతో కేటీఆర్ చర్చలకు సిద్ధం కాగా... మంత్రి ఆహ్వానాన్ని మన్నించి వీఆర్ఏలు కూడా చర్చల కోసం కేటీఆర్ వద్దకు వెళ్లారు.
ఈ సందర్భంగా ఉద్యోగాల క్రమబద్ధీకరణ, వేతనాల పెంపు తదితర సమస్యలను కేటీఆర్ ముందు వీఆర్ఏలు పెట్టారు. వీటిపై దృష్టి సారించిన మంత్రి... వీఆర్ఏల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఈ నెల 20న మరోమారు ఈ అంశాలపై సమగ్రంగా వీఆర్ఏలతో చర్చించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో వీఆర్ఏలు ఆందోళన విరమించాలని కేటీఆర్ కోరారు. మంత్రి ప్రతిపాదనపై స్పందించిన వీఆర్ఏలు తమ సంఘం నేతలతో చర్చించి తమ నిర్ణయాన్ని చెబుతామని తెలిపారు.