Chandrababu: సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్
- రూబీ లాడ్జి సెల్లార్ లో ఎలక్ట్రిక్ బైక్ షోరూం
- బ్యాటరీ చార్జింగ్ సందర్భంగా భారీ అగ్నిప్రమాదం
- పైన లాడ్జి గదుల్లో ఉన్న 8 మంది పర్యాటకుల మృతి
సికింద్రాబాద్ లోని రూబీ లాడ్జి సెల్లార్ లో ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటనలో ఎనిమిది మంది మరణించడం తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్ రూబీ లాడ్జిలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది మరణించడం బాధాకరమని చంద్రబాబు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నానని వెల్లడించారు.
అటు, పవన్ కల్యాణ్ స్పందిస్తూ, సికింద్రాబాద్ లోని ఓ హోటల్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారని తెలిసి ఆవేదనకు లోనయ్యానని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులు ఈ విధంగా ప్రమాదం బారినపడి ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని వివరించారు. ఈ ఘటనలో పలువురు క్షతగాత్రులయ్యారని తెలిసిందని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నానని పేర్కొన్నారు.
పర్యాటకంగా, వాణిజ్యపరంగా, ఐటీ రంగంలోనూ ముందుకెళుతున్న తెలంగాణ రాజధానిలో ఇటువంటి ప్రమాదాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ కు సూచించారు. హోటళ్లు, బహుళ అంతస్తుల భవనాల్లో ఎప్పటికప్పుడు అగ్నిమాపక, ఇతర రక్షణ తనిఖీలు చేయించాలని స్పష్టం చేశారు.