Andhra Pradesh: అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణంలో ఐదుగురిని అరెస్ట్ చేసిన సీఐడీ
- అమరావతి పరిధిలో అసైన్డ్ భూముల విక్రయాలపై సీఐడీ కేసు నమోదు
- 1,100 ఎకరాల్లో 169.27ఎకరాల విక్రయాలకు నిందితులు సహకరించారన్న సీఐడీ
- నిందితులకు రామకృష్ణ హౌసింగ్ డైరెక్టర్ ఖాతా నుంచి రూ.15 కోట్లు అందాయని వెల్లడి
ఏపీ రాజధాని అమరావతిలోని అసైన్డ్ భూములకు సంబంధించిన కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు మంగళవారం ఓ కీలక అడుగు వేశారు. ఈ కుంభకోణంతో సంబంధం ఉందంటూ తాజాగా ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన వారిలో కొల్లి శివరాం, గట్టెం వెంకటేశ్, చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయులు, కొట్టి దొరబాబు ఉన్నారు.
ఈ కుంభకోణంలో 1,100 ఎకరాల అసైన్డ్ భూములు చేతులు మారినట్లు సీఐడీ ఆరోపిస్తోంది. ఇందులో 169.27 ఎకరాల విక్రయాలకు సంబంధించి ఈ ఐదుగురు కీలక పాత్ర పోషించినట్లు సీఐడీ తెలిపింది. మాజీ మంత్రి నారాయణతో పాటు ఆయన సమీప బంధువుల ఆధ్వర్యంలో ఈ భూముల విక్రయాలు జరిగాయని, ఈ విక్రయాల్లో ఈ ఐదుగురు నిందితులు కీలకంగా వ్యవహరించారని ఆరోపించింది. ఇందుకు గాను వీరికి రామకృష్ణ హౌసింగ్ డైరెక్టర్ ఖాతాల నుంచి రూ.15 కోట్లు అందినట్లు ఆధారాలు లభించాయని సీఐడీ తెలిపింది.