Vitamin B12: ఛాతీలో ఈ లక్షణం కనిపిస్తే అది విటమిన్ బీ12 లోపం అయ్యుండొచ్చు!
- సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడే బీ12
- బీ12 లోపంతో అనేక సమస్యలు
- ప్రధానంగా రక్తహీనత.. గుండెపైనా ప్రభావం
మానవ దేహంలో అనేక జీవక్రియలు సాఫీగా సాగేందుకు తోడ్పడే విటమిన్లలో బీ12 ముఖ్యమైనది. డీఎన్ఏ సంశ్లేషణ, శక్తి ఉత్పాదన, కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరుకు విటమిన్ బీ12 ఎంతగానో సాయపడుతుంది.
ఈ కీలకమైన విటమిన్ లోపిస్తే అలసట, బలహీనత, ఇతర అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. అయితే, ఇవన్నీ బీ12 లోపం వల్లే తలెత్తాయని భావించరాదు. ఎందుకంటే, కొన్ని అనారోగ్య లక్షణాలు కూడా విటమిన్ లోపంతో ఉత్పన్నమయ్యే సమస్యల్లానే కనిపిస్తాయి. అందుకే, విటమిన్ టెస్టు చేయించుకోవడం ద్వారా బీ12 లోపం ఉందో, లేదో ముందు నిర్ధారించుకోవాలి.
ఇక, అసలు విషయానికొస్తే... విటమిన్ బీ12 లోపిస్తే ఆ ప్రభావం గుండెపైనా పడుతుంది. ఈ విటమిన్ తగ్గుదలతో శరీరంలో ఆక్సిజన్ లభ్యత పడిపోతుంది. దాంతో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. ఇది రక్తహీనతకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో, ఉన్న కొద్దిపాటి రక్తాన్ని శరీరం మొత్తానికి పంపించేందుకు గుండె వేగంగా పని చేయాల్సి వస్తుంది. రక్తాన్ని వేగంగా పంప్ చేసే క్రమంలో హృదయ స్పందన రేటు అధికంగా నమోదవుతుంది.
బీ12 లోపాన్ని ఈ వేగవంతమైన హార్ట్ బీట్ లక్షణంతోనూ గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే, వైద్యుడ్ని సంప్రదించి ఆయన సలహాపై రక్త పరీక్ష చేయించుకోవడం ద్వారా గుండె వేగంగా కొట్టుకోవడం అనేది రక్తహీనత వల్లా, లేక మరేదైనా లోపం వల్లా అనేది వెల్లడవుతుంది.
రక్తహీనత ఉన్నట్టు నిర్ధారణ అయితే, విటమిన్ బీ12 లోపానికి తగిన ఆహారం, లేదా సప్లిమెంట్లు వాడడం ద్వారా ఆ లోపాన్ని భర్తీ చేయొచ్చు. ఒకవేళ అవసరమైతే వైద్యులే అదనపు టెస్టులు చేయించుకోవాలని సూచిస్తారు. విటమిన్ బీ12 అధికంగా చేపలు, గుడ్లు, లివర్, మాంసం, నత్తలు, పాలు, జున్ను, తృణధాన్యాల్లో లభ్యమవుతుంది.