WHO: ఈయూను మూడు నెలలపాటు వేధించిన లాంగ్ కొవిడ్.. వెల్లడించిన అధ్యయనం
- 1.70 కోట్ల మంది లాంగ్ కొవిడ్‌తో బాధపడ్డారన్న నివేదిక
- పురుషులతో పోలిస్తే మహిళ్లలోనే ఎక్కువమంది బాధితులు
- డబ్ల్యూహెచ్ఓ కోసం అధ్యయనం చేసిన ఐహెచ్ఎంఈ
యూరోపియన్ యూనియన్ దేశాలను లాంగ్ కొవిడ్ (దీర్ఘకాలిక కొవిడ్) వేధిస్తోంది. కరోనా వైరస్ నుంచి బయటపడినా లాంగ్ కొవిడ్ లక్షణాల నుంచి యూరోపియన్ యూనియన్ దేశాల వాసులు కొన్ని నెలల వరకు బయటపడలేకపోయినట్టు తాజా నివేదిక ఒకటి వెల్లడించింది.
దాదాపు 1.70 కోట్ల మంది దీర్ఘకాలిక కొవిడ్ లక్షణాలతో మూడు నెలలపాటు బాధపడినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కోసం ‘ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ ఎవల్యూషన్( ఐహెచ్ఎంఈ) చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. 2020, 2021లో ఈయూ దేశాల్లో కరోనా సోకిన కొందరిలో మూడు నెలలపాటు లాంగ్ కొవిడ్ లక్షణాలు కొనసాగినట్టు ఐహెచ్ఎంఈ తన నివేదికలో పేర్కొంది. యూరప్, మధ్య ఆసియా ప్రాంతాల్లో లక్షలాదిమంది లాంగ్ కొవిడ్ లక్షణాలైన అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి వాటితో బాధపడినట్టు డబ్ల్యూహెచ్ఓ యూరప్ రీజనల్ డైరెక్టర్ హెన్రీ క్లూగే పేర్కొన్నారు.
లాంగ్ కొవిడ్ లక్షణాలు పురుషులతో పోలిస్తే మహిళల్లోనే రెండింతలు ఎక్కువగా ఉన్నట్టు నివేదిక తెలిపింది. అంతేకాదు, ఈ పరిస్థితి మరింత దిగజారడంతో ఒక్కోసారి ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం కూడా తలెత్తుతోందని వివరించింది. ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు, ప్రతి ఐదుగురు పురుషుల్లో ఒకరు దీర్ఘకాలిక కొవిడ్‌ను ఎదుర్కొనే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసినట్టు ఐహెచ్ఎంఈ డైరెక్టర్ క్రిస్టోఫర్ ముర్రే తెలిపారు.