Dangeti Jahnavi: ఔత్సాహిక వ్యోమగామి జాహ్నవికి ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహం.. రూ.50 లక్షల ఆర్ధిక సాయం అందజేత
- గతేడాది నాసా ప్రోగ్రామ్‌లో పాల్గొన్న జాహ్నవి
- నాసా ప్రోగ్రామ్‌లో పాల్గొన్న తొలి భారతీయురాలిగా రికార్డు
- ప్రస్తుతం ఇంజినీరింగ్ చదువుతున్న జాహ్నవి
- జాహ్నవికి చెక్కు అందజేసిన మంత్రి వేణుగోపాలకృష్ణ
ఔత్సాహిక వ్యోమగామి దంగేటి జాహ్నవికి ఏపీ ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాన్ని అందించింది. వ్యోమగామి కావాలన్న జాహ్నవి కల సాకారం అయ్యే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు రూ.50 లక్షల చెక్కును జాహ్నవికి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజులు బుధవారం అందజేశారు. తన కల సాకారం అయ్యే దిశగా ఈ మేర ఆర్థిక సాయం చేసిన సీఎం జగన్‌కు జాహ్నవి కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన జాహ్నవి ప్రస్తుతం ఇంజినీరింగ్ చదువుతోంది. ఓ వైపు ఇంజినీరింగ్ చదువుతూనే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌లో పాల్గొని రికార్డు నెలకొల్పింది. ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న తొలి భారతీయురాలిగానే కాకుండా తొలి ఆసియా ఖండ వాసిగా కూడా జాహ్నవి రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో తాను వ్యోమగామి కావాలన్న సంకల్పంతో సాగుతున్న జాహ్నవికి ఏపీ ప్రభుత్వం భారీ ప్రోత్సాహకం అందించింది.