Elephant: రెండు రోజులపాటు బురదలో చిక్కుకుపోయిన ఏనుగులు.. ఎలా రక్షించారో చూడండి!

Elephants stuck in mud for two days get rescued in Kenya Video is viral

  • కెన్యాలో చోటుచేసుకున్న ఘటన
  • నీళ్లు తాగేందుకు వచ్చి బురదలో చిక్కుకుపోయిన ఏనుగులు
  • రక్షించిన అటవీ సిబ్బందిపై కురుస్తున్న ప్రశంసలు

జంతువులు ప్రమాదంలో పడినప్పుడు చాలా వరకు అవి వాటంతట అవే బయటపడతాయి. తీవ్రమైన ప్రమాదంలో పడినప్పుడు మాత్రం మానవుల సాయం వాటికి అవసరమవుతుంది. ప్రాణాపాయంలో చిక్కుకున్న వాటిని రక్షించిన వారిపై ప్రశంసలు కురిపించకుండా ఉండడం సాధ్యం కాదు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి విషయం గురించే. కెన్యాలో బురదగుంటలో చిక్కుకుని రెండు రోజులపాటు నరకయాతన అనుభవించిన రెండు ఆడ ఏనుగులను రక్షించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. 

నీళ్లు తాగేందుకు ఓ ప్రాంతానికి వచ్చిన రెండు ఏనుగులు ప్రమాదవశాత్తు బురదగుంటలో చిక్కుకుపోయాయి. నిజానికి కరవు సాయంలో ఇలాంటివి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఎండిపోయిన మడుగులు వద్దకు వెళ్లి చిక్కుకుపోతుంటాయి. ఇక, బురదలో చిక్కుకుపోయిన ఏనుగులు నిలబడడం సాధ్యం కాక అందులో పడిపోయాయి. పైకి లేచేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో రెండు రోజులపాటు అవి అలాగే ఉండిపోయాయి. 

  ఇలాంటి క్లిష్ట సమయాల్లో జంతువులకు మానవుల సాయం ఎంతో అవసరమని, అందుకనే ఇలాంటి వీడియోలు అందరి పెదవులపై నవ్వులు పూయిస్తాయని కెన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్ (కేడబ్ల్యూఎస్) అధికారులు పేర్కొన్నారు. కాగా, హెలికాప్టర్ సాయంతో ఏనుగులు చిక్కుకున్న ప్రాంతానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది బురదలోకి దిగి వాటికి తాళ్లు కట్టి ట్రాక్టర్, కారు సాయంతో అందులోంచి వాటిని బయటకు లాగారు. అవి బయటకు వచ్చిన తర్వాత రెండూ కలిసి అడవిలోకి పరుగెత్తాయి. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ‘షెల్ట్రిక్ వైల్డ్ ట్రస్ట్’.. రెండు రోజుల తర్వాత ఏనుగులకు ఓ ‘హ్యాపీ ఎండింగ్’ లభించిందని పేర్కొంది. వైరల్ అవుతున్న ఈ వీడియోకు ఇప్పటికే వేలాది లైకులు లభించాయి. రెస్క్యూ సిబ్బందిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మరికొందరు ఆ ఏనుగుల ఆరోగ్యంపై ఆరా తీశారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • Loading...

More Telugu News