Nawab Malik: నవాబ్ మాలిక్ అమాయకుడు కాదు.. దావూద్ ఇబ్రహీం సోదరితో సంబంధాలు ఉన్నాయి: ఈడీ
- మనీ లాండరింగ్ కేసులో ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ ను అరెస్ట్ చేసిన ఈడీ
- ప్రస్తుతం జైల్లో ఉన్న నవాబ్ మాలిక్
- మాలిక్ కు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరిన ఈడీ
మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ ను మనీ లాండరింగ్ కేసులో ఈ ఏడాది ఫిబ్రవరి 23న ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, ఆయన సన్నిహితులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఆయనను ఈడీ అదుపులోకి తీసుకుంది. కోర్టు ఆయనను రిమాండుకు తరలించింది.
మరోవైపు ఈడీ ప్రత్యేక కోర్టులో నవాబ్ మాలిక్ బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఈడీ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ వాదనలను వినిపిస్తూ నవాబ్ మాలిక్ అమాయకుడు కాదని కోర్టుకు తెలిపారు. దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ తో ఆయనకు సంబంధాలు, లావాదేవీలు ఉన్నాయని చెప్పారు. ఆయనకు బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరారు.
వివాదాస్పద ల్యాండ్ సెటిల్మెంట్లను హసీనా పార్కర్ చేస్తుంటారని... ఎప్పటి నుంచో ఇది ఆమె దందా అని అనిల్ సింగ్ చెప్పారు. తన తల్లి నవాబ్ మాలిక్ కు ఒక భూమిని ఇచ్చిందని ఆమె సొంత కుమారుడే ఒక స్టేట్మెంట్ లో చెప్పారని గుర్తు చేశారు. హసీనా పార్కర్ కు నవాబ్ మాలిక్ డబ్బులు ఇస్తుండటాన్ని తాను చూశానని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పారని కోర్టుకు తెలిపారు. ఈ పరిణామాలన్నింటినీ చూస్తే నవాబ్ మాలిక్ అమాయకుడు కాదనే విషయం స్పష్టంగా అర్థమవుతుందని... ఆయనకు హసీనాతో లావాదేవీలు ఉన్నాయని చెప్పారు. ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరారు. ప్రస్తుతం నవాబ్ మాలిక్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.