Jagan: మీరు కుటుంబాల గురించి మాట్లాడటం మానేస్తే.. మా వాళ్లు కూడా ఆటోమేటిక్ గా మానేస్తారు: అచ్చెన్నాయుడుతో జగన్
- బీఏసీ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు
- రాజకీయ నాయకులుగా మనం వంద అనుకుంటామన్న జగన్
- కుటుంబాల జోలికి రావాలనుకోము అని వ్యాఖ్య
ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో జరిగిన బీఏసీ సమావేశంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ సమావేశానికి టీడీపీ తరపున అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కుటుంబాన్ని ఉద్దేశించి విమర్శలు చేస్తే తాము ఊరుకునేది లేదని మంత్రులు బుగ్గన, జోగి రమేశ్ అచ్చెన్నాయుడుతో అన్నారు.
ఈ క్రమంలో జగన్ కల్పించుకుని... అచ్చెన్నాయుడుతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనం రాజకీయ నాయకులమని... మనలో మనం వంద అనుకుంటామని జగన్ చెప్పారు. మేము కుటుంబాల జోలికి రావాలనుకోమని అన్నారు. మీరు కుటుంబాల జోలికి వస్తే మా సీఎం కుటుంబాన్ని అంటారా అని మా వాళ్లు అంటారని... అందుకే మీరు కుటుంబాల గురించి మాట్లాడటం మానేస్తే... మా వాళ్లు కూడా ఆటోమేటిక్ గా మానేస్తారని చెప్పారు.
సభలో మీరు లేవనెత్తబోయే ప్రశ్నలు, మేము లేవనెత్తబోయేవి దాదాపు ఒకటేనని జగన్ అన్నారు. అన్ని విషయాలపై చర్చిద్దామని... మీకు కావాల్సినన్ని రోజులు చర్చిద్దామని చెప్పారు. మీరు కావాలనుకుంటే రాజధానిపై, ఈఎస్ఐ స్కామ్ పై కూడా చర్చ జరుపుతామని అన్నారు.