Tata Group: ఎయిర్ ఇండియా పేరు మార్చిన టాటా గ్రూప్... కొత్త పేరు, కొత్త లక్ష్యం వెల్లడి
- ఇటీవలే ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసిన టాటా గ్రూప్
- తాజాగా విహాన్‌గా ఎయిర్ ఇండియా పేరును మార్చిన వైనం
- గ్లోబల్ ఎయిర్‌లైనర్‌గా స్థిరపడేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్న టాటా
- రానున్న ఐదేళ్లలో వాటాను 30 శాతానికి పెంచుకోవడమే లక్ష్యమని వెల్లడి
మొన్నటిదాకా భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియా సేవలను మరింతగా విస్తరించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్న టాటాలు.. గురువారం ఎయిర్ ఇండియా పేరును మార్చేశారు. ఎయిర్ ఇండియా పేరును విహాన్‌గా మారుస్తూ ఆ సంస్థ ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. విహాన్ అనే కొత్త పేరుతో ఎయిర్ ఇండియా ప్రయాణికుల ముందుకు రానుందని టాటా గ్రూప్ ప్రకటించింది.
భారతీయ మూలలతో ప్రపంచ స్థాయి గ్లోబల్ విమానయాన సంస్థగా మరోసారి సత్తా చాటేందుకు, అంతర్జాతీయ విపణిలో స్థిరపడేందుకు సమగ్రమైన ట్రాన్స్‌ఫర్మేషన్ ప్లాన్‌ను ఆవిష్కరించినట్లు టాటా గ్రూప్ తన ప్రకటనలో పేర్కొంది. రాబోయే 5 సంవత్సరాలలో ఎయిర్ ఇండియా దేశీయ మార్కెట్‌లో తన వాటాను కనీసం 30 శాతానికి పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశీయ విమానయాన రంగంలో ఎయిర్ ఇండియా వాటా 8 శాతంగా ఉందని వెల్లడించింది.