Congress: కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికకు షెడ్యూల్ విడుదల
- కాంగ్రెస్‌కు తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియా గాంధీ
- అక్టోబర్ 17న అధ్యక్ష పదవికి ఎన్నికలు, అదే రోజు ఫలితాలు
- ఈ నెల 22న విడుదల కానున్న నోటిఫికేషన్
- ఈ నెల 24 నుంచి 30 వరకు నామినేషన్ల స్వీకరణ
కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి అధ్యక్షుడు లేక చాలా కాలమే అయ్యింది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం దక్కగా... అందుకు బాధ్యత వహిస్తూ నాడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ పదవికి రాజీనామా చేశారు. నాడు మరో ప్రత్యామ్నాయం ఎంచుకునే వ్యవధి లేకపోవడంతో సోనియా గాంధీ పార్టీకి తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగానే ఆమె కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీకి రెగ్యులర్ అధ్యక్షుడి ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ విడుదల చేసింది.
ఈ షెడ్యూల్ ప్రకారం ఈ నెల (సెప్టెంబర్) 22న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 24 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. ఈ నెల 30 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఇక ఈ ఎన్నికలో కీలక అంకమైన అధ్యక్ష పదవికి ఎన్నికలు అక్టోబర్ 17న జరగనున్నాయి. ఫలితాలు కూడా అదే రోజున విడుదల అవుతాయి. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్ల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఈ నెల 20 తర్వాత నుంచి రూపొందించే పనిని ప్రారంభించనుంది.