Narendra Modi: ఎస్‌సీవో సమ్మిట్ కోసం ఉజ్బెకిస్థాన్ చేరుకున్న ప్రధాని మోదీ.. పుతిన్‌తో కీలక చర్చలు!

PM Modi in Uzbekistan for SCO summit to hold talks with Putin
  • ఉజ్బెక్‌లో మోదీకి ఘన స్వాగతం
  • రెండు రోజులపాటు జరగనున్న 22వ ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సు
  • పలు దేశాధి నేతలతో సమావేశం కానున్న మోదీ
  •  కొవిడ్-19 తర్వాత జరుగుతున్న తొలి వ్యక్తిగత సమావేశం ఇదే
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్ చేరుకున్నారు. రెండు రోజులపాటు జరగనున్న ఈ 22వ సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయెవ్‌లతో మోదీ నిర్మాణాత్మక ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ప్రాంతీయ భద్రతా సవాళ్లు, వాణిజ్యం, ఇంధన సరఫరాలను పెంచడం వంటివాటిపై ఈ సదస్సులో చర్చించనున్నారు.  

* ఉజ్బెకిస్థాన్ చేరుకున్న మోదీకి ఆ దేశ ప్రధాని అబ్దుల్లా అరిపోవ్, మంత్రులు, సమర్‌కండ్ గవర్నర్, సీనియర్ అధికారులు స్వాగతం పలికినట్టు భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎంఈఏ) అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. సమ్మిట్ లో పాల్గొనేందుకు వచ్చిన దేశాధినేతలకు బాణసంచా వెలుగుల మధ్య స్వాగతం పలికింది.

* ఎస్‌సీవో సమ్మిట్ లో పాల్గొన్న అనంతరం ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడితోపాటు ఈ సమ్మిట్‌కు హాజరవుతున్న ఇతర నేతలతో మోదీ సమావేశమవుతారు. కొవిడ్-19, ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత జరుగుతున్న తొలి వ్యక్తిగత సమావేశం ఇదే. 

* రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, ఉజ్బెక్ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయెవ్‌లతో‌ మోదీ సమావేశమవుతారు. 

* ఈ శిఖరాగ్ర సమావేశంలో మోదీ, పుతిన్‌లు వాణిజ్యం, భౌగోళిక రాజకీయాలపై చర్చలు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని పరిస్థితులు, ఐక్య రాజ్యసమితి, జి20 దేశాల్లో ద్వైపాక్షిక సహకారంపైనా ఇరువురు నేతలు చర్చిస్తారని భావిస్తున్నారు. 
 
* ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం ఇదే. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో మిలటరీ విన్యాసాల తర్వాత పుతిన్‌కు మోదీ ఫోన్ చేసి, ఉక్రెయిన్‌లో హింసను తక్షణమే నిలిపివేయాలని కోరినట్టు గతంలో భారత విదేశాంగ శాఖ తెలిపింది.
Narendra Modi
Uzbekistan
SCO
Vladimir Putin
Russia
Samarkand

More Telugu News