Atchannaidu: పిట్ట కథల మంత్రి బుగ్గన కరోనాపై నెపం మోపుతున్నారు: అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ తర్వాత అచ్చెన్నాయుడు విమర్శలు

Atchannaidu comments on Jagan and Buggan after suspension from Assembly
  • వైసీపీ ప్రభుత్వం ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేకపోయిందన్న అచ్చెన్న 
  • ఏం సాధించారని పారిశ్రామిక విధానంపై చర్చ పెట్టారని నిలదీత 
  • కడప స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం చేతకాక.. కరోనాపై నెపం మోపుతున్నారని విమర్శ 
కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంశం విభజన చట్టంలో ఉందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు చెప్పారు. విభజన చట్టంలోని అంశాలను సాధించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని విమర్శించారు. వైసీపీ నేతలు కొన్ని వందల సార్లు ఢిల్లీకి వెళ్లారని, రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అయితే ఢిల్లీలోనే శాశ్వతంగా ఉంటున్నారని... అయినా సాధించింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. 

రాష్ట్రానికి ఒక్క పరిశ్రమను కూడా వైసీపీ ప్రభుత్వం తీసుకురాలేకపోయిందని అన్నారు. ఏం సాధించారని శాసనసభలో పరిశ్రమలపై చర్చను పెట్టారని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తున్న తమపై ఎదురు దాడి చేస్తున్నారని మండిపడ్డారు. 

సొంత జిల్లా కడపకు కూడా ముఖ్యమంత్రి జగన్ పరిశ్రమలను తీసుకురాలేకపోతున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. అయినా సిగ్గు, ఎగ్గు లేకుండా శాసనసభలో పారిశ్రామిక విధానంపై చర్చ పెట్టారని అన్నారు. టైమ్ వేస్ట్ తప్ప... దీనిపై చర్చ వల్ల వచ్చేదేమీ లేదని చెప్పారు. ఆర్థిక మంత్రి బుగ్గనను పిట్ట కథల మంత్రి, ఆవు కథల మంత్రి అంటూ ఎద్దేవా చేశారు. 

కడప స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం చేత కాక... కరోనాపై నెపం మోపుతున్నారని మండిపడ్డారు. నిన్నటి వరకు ఒక మాట మాట్లాడారని... ఇక చేయడం చేతకాదని అర్థమయ్యే సరికి ఇప్పుడు కథలు చెపుతున్నారని విమర్శించారు. అసమర్థులే ఇలాంటి కారణాలు చెపుతారని అన్నారు. 

చంద్రబాబు వంటి సమర్థులైన నాయకులు ఎలాంటి ఆటంకాలు ఎదురైనా... చేపట్టిన పనులను పూర్తి చేస్తారని వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ అచ్చెన్నాయుడు పైవ్యాఖ్యలు చేశారు.
Atchannaidu
Chandrababu
Telugudesam
Jagan
Buggana Rajendranath
YSRCP
Kadapa Steel Plant

More Telugu News