YSRCP: వైఎస్సార్ తోడల్లుడిని అయినందుకే నాపై తప్పుడు కేసు పెట్టారు: వైవీ సుబ్బారెడ్డి
- ఇందూ ప్రాజెక్ట్స్ కేసులో వైవీ సుబ్బారెడ్డి పేరు
- తన పేరును తొలగించాలంటూ సుబ్బారెడ్డి క్వాష్ పిటిషన్
- విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు
- సుబ్బారెడ్డి పేరును తొలగించవద్దన్న సీబీఐ
- విచారణను ముగించి తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నమోదైన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న కేసులకు సంబంధించి శుక్రవారం తెలంగాణ హైకోర్టులో ఓ కీలక విచారణ జరిగింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో భాగంగా ఇందూ ప్రాజెక్ట్స్పైనా కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో వైఎస్ జగన్తో పాటు ఆయన పినతల్లి భర్త, ప్రస్తుతం టీటీడీ చైర్మన్గా కొనసాగుతున్న వైవీ సుబ్బారెడ్డి పేరును కూడా సీబీఐ అధికారులు చేర్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తన పేరును తొలగించాలంటూ ఇటీవలే వైవీ సుబ్బారెడ్డి తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది.
ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు ముందు ఓ విషయాన్ని ప్రస్తావించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి తోడల్లుడు అయినందుననే తన క్లెయింట్ను ఈ కేసులో ఇరికించారని ఆయన కోర్టుకు తెలిపారు. తమ వాదనను పరిగణనలోకి తీసుకుని సుబ్బారెడ్డి పేరును ఈ కేసు నుంచి తొలగించాలని కోరారు.
అయితే, ఈ వాదనను తిప్పికొడుతూ సీబీఐ వాదనలు వినిపించింది. కేవలం కొన్ని లక్షలు పెట్టుబడి పెట్టి... దానితో సుబ్బారెడ్డి కోట్లు గడించారని సీబీఐ ఆరోపిచింది. ఈ కారణంగా ఆయన పేరును కేసులో నుంచి తొలగించవద్దని కోరింది. ఇరు వర్గాల వాదనలను విన్న కోర్టు... విచారణ ముగిసినట్లు ప్రకటించింది. ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు వెల్లడించింది.