Amit Shah: హైదరాబాదులో అమిత్ షా కాన్వాయ్ కి కారు అడ్డంగా రావడంతో అద్దాలు పగులగొట్టిన భద్రతా సిబ్బంది
- హరిత ప్లాజా వద్ద ఘటన
- ఎంతకీ పక్కకి తొలగని కారు
- నిలిచిపోయిన అమిత్ షా కాన్వాయ్
- తెలంగాణ ప్రభుత్వంపై మండిపడిన ఎంపీ లక్ష్మణ్
హైదరాబాదులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. అమిత్ కాన్వాయ్ వెళుతుండగా ఓ కారు అడ్డంగా రావడంతో భద్రతా సిబ్బంది ఆ కారు అద్దాలు పగులగొట్టారు. హరిత ప్లాజా వద్ద కారు ఆగిన సమయంలో ఈ ఘటన జరిగింది.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో హైదరాబాద్ విమోచన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అమిత్ షా హరిత ప్లాజా వైపు పయనమయ్యారు. అయితే, మంచిర్యాల జిల్లా కాగజ్ నగర్ కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తికి చెందిన కొత్త కారు అమిత్ షా కాన్వాయ్ కి అడ్డుగా వచ్చింది. దాంతో అమిత్ షా కాన్వాయ్ ఆగిపోయింది.
ఎంతకీ ఆ కారు పక్కకి తొలగకపోవడంతో భద్రతా సిబ్బంది ఆ కారు అద్దాలు పగులగొట్టారు. దీనిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తీవ్రస్థాయిలో స్పందించారు. కేంద్ర హోంమంత్రి పర్యటనకు వస్తే ఇలాగేనా భద్రత ఏర్పాట్లు చేసేది? అని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇతరులను ఎలా రక్షిస్తారని మండిపడ్డారు.