Congress: ఈడీ విచారణకు హాజరైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్
- డీకేపై మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ
- విచారణకు హాజరు కావాలంటూ గతవారం నోటీసులు
- విచారణకు ఇప్పుడప్పుడే వెళ్లబోనన్న కేపీసీసీ చీఫ్
- ఢిల్లీలో సోమవారం ఈడీ విచారణకు హాజరు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ కర్ణాటక శాఖ (కేపీసీసీ) అధ్యక్షుడు డీకే శివకుమార్ సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారంటూ ఇదివరకే ఈడీ అధికారులు శివకుమార్‌పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా తమ ముందు విచారణకు హాజరు కావాలని శివకుమార్‌కు ఈడీ అధికారులు గత వారం నోటీసులు జారీ చేశారు.
ఈ నోటీసుల కాపీ పట్టుకుని నేరుగా సోమవారం ఢిల్లీ వెళ్లిన శివకుమార్... ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు, మరోవైపు తమ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర త్వరలోనే కర్ణాటకలో ప్రవేశించనున్నందున ఇప్పుడిప్పుడే ఈడీ విచారణకు హాజరు అయ్యేది లేదని నోటీసులు అందుకున్న తర్వాత శివకుమార్ చెప్పారు. ఈలోగా ఏం జరిగిందో తెలియదు గానీ... ఈడీ అధికారుల నోటీసుల ప్రకారమే శివకుమార్ వారి ముందు విచారణకు హాజరయ్యారు.